Karimnagar : హోటళ్లలో మద్యం దందా.. చింతకుంటలో జోరుగా డ్రై డే..!
ఓవైపు దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతుంటే.. మరోవైపు నిబంధనలను తుంగలో తొక్కుతూ కొందరు మద్యం దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు.
Karimnagar : హోటళ్లలో మద్యం దందా.. చింతకుంటలో జోరుగా డ్రై డే..!
పేరుకే హోటళ్లు.. లోపల ‘బార్’ తంతు!
నిబంధనలు ‘బేఖాతర్’..
కరీంనగర్, మనసాక్షి :
ఓవైపు దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతుంటే.. మరోవైపు నిబంధనలను తుంగలో తొక్కుతూ కొందరు మద్యం దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఆగస్టు 15 పురస్కరించుకుని ప్రభుత్వం మద్యం అమ్మకాలను నిషేధించి, ‘డ్రై డే’గా ప్రకటించినప్పటికీ, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చింతకుంటలో మాత్రం మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
చింతకుంట చేపల మార్కెట్ సమీపంలోని పలు హోటళ్లు ఇందుకు అడ్డాలుగా మారాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వైన్స్ షాపులు, బార్లకు సెలవు కావడాన్ని ఈ హోటల్ నిర్వాహకులు ఆసరాగా చేసుకున్నారు. ఒక రోజు ముందే పెద్ద ఎత్తున మద్యాన్ని కొనుగోలు చేసి నిల్వ ఉంచారు. డ్రై డే రోజున మద్యం ప్రియుల అవసరాన్ని పెట్టుబడిగా మార్చుకుంటూ, ఒక్కో సీసాపై భారీగా అదనపు వసూళ్లకు పాల్పడుతూ సొమ్ము చేసుకుంటున్నారు.
పేరుకే హోటళ్లు.. లోపల ‘బార్’ దందా.
ఎస్సారెస్పీ కెనాల్‌కు సంబంధించిన ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించి, తాత్కాలికంగా రేకుల షెడ్లు వేసి ఈ హోటళ్లను ఏర్పాటు చేశారు. బయటకు హోటళ్లుగా కనిపిస్తున్నప్పటికీ, లోపల మాత్రం బార్లను తలపించేలా మద్యం దందా సాగుతోంది. మద్యం ప్రియులను ఆకర్షించేందుకు వీలుగా చేపల ఫ్రై, చికెన్, మటన్ వంటకాలతో పాటు చపాతీలను కూడా ఇక్కడే సిద్ధం చేస్తుండటంతో నిత్యం ఇవి తాగుబోతులతో కిక్కిరిసిపోతున్నాయి.
వాహనదారుల అవస్థలు
ఈ హోటళ్లకు వచ్చే మద్యం ప్రియులు తమ వాహనాలను రోడ్డుపైనే ఇష్టారాజ్యంగా నిలపడంతో చింతకుంట – వెలిశాల బైపాస్ రోడ్డు ఎప్పుడూ రద్దీగా మారుతోంది. ఇటు చేపల మార్కెట్‌కు వచ్చేవారు, అటు సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ అధికారులు స్పందించి, ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నడుస్తున్న ఈ బెల్ట్ షాపులపై, హోటళ్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.









