Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణపండుగలురాజకీయం

భవానీ దీక్షలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ భవానీ దీక్ష చేపట్టారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య మాలాధారణ చేశారు.

భవానీ దీక్షలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌

11 రోజులపాటు మహాశక్తి అమ్మవారి సేవలోనే..

నేటి నుంచి మాలాధారణ.. నవరాత్రి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు

కరీంనగర్‌ బ్యూరో, మనసాక్షి :

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ భవానీ దీక్ష చేపట్టారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య మాలాధారణ చేశారు. ఎర్రని వస్త్రాలు ధరించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా 11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న ఆయన.. ఈ కాలమంతా ఆలయంలోనే ఉంటూ అమ్మవారి సేవలో గడపనున్నారు. దీక్ష సమయంలో వివిధ సమస్యల పరిష్కారం కోసం తనను కలిసేందుకు వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా టెంట్‌ ఏర్పాటు చేశారు. ప్రజలను అక్కడే కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోనున్నారు.

నవరాత్రి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు

దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఆలయ పరిసరాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉత్సవాల నిర్వహణను కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లతోపాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. భవానీ దీక్షాధారులకు పూజా, భోజన వసతులు ఏర్పాటు చేశారు. నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులందరికీ ఉచితంగా ప్రసాదాలు అందించనున్నారు. ప్రతిరోజూ సుమారు 5 వేల నుంచి 10 వేల మంది భక్తులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించేలా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

ఏటేటా పెరుగుతున్న దీక్షాధారుల సంఖ్య

శ్రీ మహాశక్తి ఆలయాన్ని 16 ఏళ్ల క్రితం ప్రతిష్ఠించారు. ప్రారంభంలో బండి సంజయ్‌ కుటుంబ సభ్యులతోపాటు కొద్దిమంది మాత్రమే నవరాత్రుల సందర్భంగా భవానీ మాలాధారణ చేసి దీక్ష చేపట్టేవారు. కాలక్రమేణా దీక్షాధారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా గత రెండేళ్లుగా దుర్గామాల ధరించే యువకుల సంఖ్య వేలల్లోకి చేరినట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఎరుపు రంగు వస్త్రాలు ధరించి భక్తులు దీక్షను ఆచరిస్తున్నారు.

108 రోజుల దీక్ష, మండల దీక్ష, నవరాత్రి దీక్ష.. ఇలా వివిధ కాలపరిమితులతో భక్తులు అమ్మవారిని ఆరాధిస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు పొందుతూ, ఆమెను నమ్ముకుని ముందుకు సాగాలనే సంకల్పంతో దీక్షలు చేపడుతున్నారు. శుక్రవారం కావడంతో భవానీ దీక్షాధారులు, భక్తుల రాకతో శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయం సందడిగా మారింది. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండటంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు