వ్యవసాయ బావిలో పడిన కారు, ఒకరు మృతి – latest news

వ్యవసాయ బావిలో పడిన కారు, ఒకరు మృతి

గరిడేపల్లి, జూలై 05, మనసాక్షి : ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో కారు పడి ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైన సంఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె గ్రామం నుంచి సూర్యాపేటకు కారులో ముగ్గురు వ్యక్తులు వెళ్తుండగా గరిడేపల్లి మండలం మర్రికుంట గ్రామ శివారులో ప్రమాదవశాత్తు కారు రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడింది. దాంతో కారులో ప్రయాణిస్తున్న కోయిలకర్ సందీప్ (38) అనే వ్యక్తి చనిపోగా, కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి జమాల్పురి సంతోష్, డ్రైవర్ ఆకుల రాజేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చనిపోయిన సందీప్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ALSO READ : విద్యార్థి ప్రాణం బలిగొన్న ఆ ఒక్క మార్కు.. మాడ్గులపల్లి మండలంలో ఘటన – latest news

సందీప్, సంతోష్ లు సూర్యాపేట పట్టణానికి చెందిన చేపల కాంట్రాక్టర్లు. నేరేడుచర్ల మండలంలోని చెరువులో చేపలు పట్టించి మంగళవారం ఉదయం కారులో సూర్యాపేటకు బయలుదేరారు, కారు మరికుంట గ్రామ శివారు చేరుకునే సమయంలో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడింది. సంతోష్, డ్రైవర్ రాజేష్ లు ప్రాణాపాయం నుంచి బయటపడగా వెనక సీట్ లో ఉన్న సందీప్ చనిపోయారు.

ALSO READ : BREAKING : మిర్యాలగూడలో క్రేన్ ఢీకొని వ్యక్తి మృతి

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఎస్సై కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో క్రేన్ సహాయంతో బావిలో పడిన కారును బయటకు తీశారు. చనిపోయిన సందీప్ భార్య ప్రసన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గరిడేపల్లి ఎస్సై కొండల్ రెడ్డి తెలిపారు. సందీప్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్ నగర్ ఆసుపత్రికి తరలించారు.