Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. దేవరకొండకు అండగా ఉంటా..!

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. దేవరకొండకు అండగా ఉంటా..!

నల్గొండ ప్రతినిధి, మనసాక్షి :

దేవరకొండకు అండగా ఉంటానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా శనివారం ఆయన నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమానికి హాజరై సుమారు 20 కోట్ల రూపాయల వ్యయంతో దేవరకొండ మున్సిపాలిటీలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతేకాక మెప్మా మహిళా సంఘాలకు 11 కోట్ల 33 లక్షల 46వేల రూపాయల బ్యాంకు లింకేజీ చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో, గంజాయిని అరికట్టడంలో, విద్య, వైద్యం, తదితర రంగాలలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే దేశంలోనే మొదటి స్థానంలో ఉందని అన్నారు. డిసెంబర్ 8, 9 తేదీలలో మహేశ్వరంలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో తెలంగాణ అభివృద్ధి ,సంక్షేమాలను ప్రపంచానికి కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, దేవరకొండ నియోజకవర్గానికి నర్సింగ్ కళాశాలను ఇస్తామని, ఇందుకుగాను వెంటనే అంచనాల రూపొందించి పంపించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

దేవరకొండ నియోజకవర్గం లో తండాల నుండి మండలాలకు, మండలాల నుండి జిల్లా కేంద్రానికి, జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్ కు రహదారులు నిర్మించేందుకు అలాగే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి ,అలాగే రోడ్లు ,భవనాలు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులను దేవరకొండ కు పంపించి దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ కోరిన విధంగా దేవరకొండ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించేలా పంపిస్తామని తెలిపారు.

గిరిజనులు అత్యధికంగా ఉండే దేవరకొండ, అచ్చంపేట ప్రాంతాలలో మద్దిమడుగును పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని మద్దిమడుగులో ఏర్పాటు చేసుకుందామని అన్నారు. దేవరకొండ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి గతంలో నిధులు ఇవ్వడం జరిగిందని, అసంపూర్తిగా నిలిచిపోయిన దేవాలయ పనులను పూర్తి చేసినందుకు రానున్న ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించి పూర్తి చేస్తామన్నారు.

దేవరకొండ జూనియర్ కళాశాల అభివృద్ధికి 6 కోట్ల నిధులు ఇస్తామన్నారు. నియోజకవర్గ పరిధిలోని పెండ్లిపాకల తో పాటు, అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు ఈ అసెంబ్లీ హాయంలోనే పూర్తి చేస్తామని, అలాగే ఎస్ఎల్ బి సీని, డిండిని పూర్తి చేస్తామని చెప్పారు.

తమ ప్రభుత్వ హయాంలో రెండేళ్లలో 61 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని ,24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని, 25 లక్షల ముప్పై ఐదువేల రైతు కుటుంబాలకు 25614 కోట్ల రైతు రుణమాఫీ చేశామని అన్నారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, రాష్ట్రవ్యాప్తంగా 22,500 కోట్లతో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నామని, ఐటిడిఏ, చెంచులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో అదనంగా 25 వేల ఇండ్లు ఇవ్వడానికి ప్రత్యేకంగా జీవో తీసుకువచ్చామన్నారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2004- 2014 వరకు లంబాడి తండాలు, ఆదివాసిగూడలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత తమదేనని అన్నారు.

రాష్ట్రంలో మూడు కోట్ల 10 లక్షల మంది సన్న బియ్యం తింటున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ సన్న బియ్యం ఇవ్వటం లేదని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇవ్వడం వల్ల రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు బాగుపడుతున్నాయని ఆయన చెప్పారు. అవసరమైన, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు వెళ్లడం జరుగుతున్నదని, దేవరకొండ నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు .

దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ అధ్యక్షత వహించగా విజయోత్సవాలలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ, దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు, తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. Gold Price : తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఇవీ..!

  2. సత్తుపల్లిలో అటవీ జంతువుల వేట.. బీఆర్ఎస్ నేతల హస్తంపై సర్వత్రా చర్చ..!

  3. Sarpanch Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. తొలివిడతలో ఏకగ్రీవాలు అన్ని వందలా..!

  4. TG News : రైతులకు తీపి కబురు.. ఖాతాలలో రూ.7887 కోట్లు, రాకుంటే ఇలా చేయండి..!

మరిన్ని వార్తలు