IT : క్లియర్‌ట్యాక్స్ ఏఐ ఆవిష్కరణ.. తెలుగుతో సహా పలు భాషల్లో ఐటీఆర్ ఫైలింగ్ సులభతరం..!
IT : క్లియర్‌ట్యాక్స్ ఏఐ ఆవిష్కరణ.. తెలుగుతో సహా పలు భాషల్లో ఐటీఆర్ ఫైలింగ్ సులభతరం..!
బెంగళూరు, మన సాక్షి :
ఫిన్‌టెక్ సంస్థ క్లియర్‌కు చెందిన అగ్రగామి ట్యాక్స్ ఫైలింగ్ ప్లాట్‌ఫాం క్లియర్‌ట్యాక్స్, భారతదేశపు ట్యాక్స్-టెక్ విభాగంలో సరికొత్త ఆవిష్కరణకు తెరలేపింది. ‘క్లియర్‌ట్యాక్స్ ఏఐ’ని పరిచయం చేసింది. ఇది వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టు పనిచేసే, తెలుగు సహా ఇతర భారతీయ భాషలలో అందుబాటులో ఉండే ఒక బహుభాషా ఏఐ ఆధారిత ట్యాక్స్ అసిస్టెంట్. ఆదాయ వనరు, భౌగోళిక ప్రాంతం, డిజిటల్ నైపుణ్యాలతో నిమిత్తం లేకుండా, ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫైలింగ్‌ను ప్రతి భారతీయునికి సరళమైన, ఒత్తిడి లేని ప్రక్రియగా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం.
భాషా సౌలభ్యం, ప్లాట్‌ఫాం లభ్యత:
ట్యాక్స్ ఫైలర్లు ఇప్పుడు తమకు నచ్చిన భాషలో చాటింగ్ చేస్తూ, కేవలం మూడు నిమిషాల్లో ట్యాక్స్‌లు ఫైల్ చేయవచ్చు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, బంగ్లా వంటి 7 భాషలలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్, స్లాక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫాంలు లేదా క్లియర్‌ట్యాక్స్ వెబ్సైట్ల ద్వారా ఈ సేవలు పొందవచ్చు. వేతన జీవులైనా, గిగ్ వర్కర్లైనా, ఫ్రీలాన్సర్లైనా, మొదటిసారి ఫైల్ చేసే వారైనా సరే, ఈ ప్రక్రియను స్వతంత్రంగా పూర్తి చేయవచ్చు. సంక్లిష్టమైన ట్యాక్స్ ఫారంలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తప్పింది.
క్లియర్‌ట్యాక్స్ ఏఐ ప్రత్యేకతలు:
క్లియర్‌ట్యాక్స్ ఏఐ సంక్లిష్టమైన పన్నుల పరిభాషను సరళమైన భాషలోకి మారుస్తుంది. ఆటోమేటిక్‌గా సరైన ఐటీఆర్ ఫారం, రెజీమ్‌ను ఎంపిక చేస్తుంది. అవసరమైన డేటాలో 95 శాతం వరకు ఆదాయపు పన్ను శాఖ నుంచి నేరుగా తీసుకుంటుంది. వర్తించే అన్ని డిడక్షన్లు వర్తింపజేస్తుంది. పలు భారతీయ భాషల్లో నిరంతర మద్దతు అందిస్తూ, దీర్ఘకాలిక ప్రతిబంధకాలను తొలగిస్తుంది. ట్యాక్స్ ఫైలర్లు కేవలం తమ పాన్ ఎంటర్ చేసి, ఫారం 16, బ్రోకర్ స్టేట్మెంట్లను అప్లోడ్ చేస్తే మిగతా పనంతా ఏఐ చూసుకుంటుంది.









