నట్టింట్లో శవం.. ఆస్తి కోసం లొల్లి..!
ఆస్తి వివాదం మానవ సంబంధాలను దెబ్బతీసింది. ఇంటి పెద్ద మృతిచెందగా.. అంత్యక్రియలు నిర్వహించాల్సిన సమయంలో ఆస్తి పంపకాల అంశం తెరపైకి వచ్చింది.

నట్టింట్లో శవం.. ఆస్తి కోసం లొల్లి..!
తలకొరివి పెట్టే విషయంలో వారసుల మధ్య వివాదం
వేములవాడలో ఘటన.. పోలీసులకు ఫిర్యాదు
(నరేష్ – కరీంనగర్ బ్యూరో), మనసాక్షి:
ఆస్తి వివాదం మానవ సంబంధాలను దెబ్బతీసింది. ఇంటి పెద్ద మృతిచెందగా.. అంత్యక్రియలు నిర్వహించాల్సిన సమయంలో ఆస్తి పంపకాల అంశం తెరపైకి వచ్చింది. తలకొరివి పెట్టే విషయంలో వారసుల మధ్య విభేదాలు తలెత్తడంతో మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి వాదోపవాదాలకు దిగిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని 13వ వార్డు కోనాయిపల్లిలో చోటుచేసుకుంది. సోమవారం మృతిచెందిన వృద్ధుడి అంత్యక్రియలు బుధవారం ముగిశాయి.
ఎకరన్నర భూమి.. ఇల్లు
కోనాయిపల్లికి చెందిన కొంకటి చంద్రయ్య (80) అనారోగ్యంతో సోమవారం మృతిచెందారు. ఆయన భార్య పోచవ్వ కొన్నేళ్ల క్రితమే మరణించారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు నాగరాజుకు ఇద్దరు భార్యలు కాగా.. మొదటి భార్యకు ఒక కుమారుడు, రెండో భార్యకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగరాజు కూడా కొన్నేళ్ల క్రితమే మృతిచెందారు.
చంద్రయ్యకు ఎకరన్నర వ్యవసాయ భూమితోపాటు ఇల్లు ఉంది. నాగరాజు రెండో భార్య, ఆమె కుమార్తెలు కొంతకాలంగా చంద్రయ్యను చూసుకుంటున్నట్లు సమాచారం. ఆయన మృతితో ఆస్తి పంపకాల అంశం వివాదానికి దారితీసింది. తాము సేవలు చేసినందున అంత్యక్రియల్లో తలకొరివి పెట్టే అవకాశం తమకే ఇవ్వాలని రెండో కోడలు, ఆమె కుమార్తెలు పట్టుబట్టినట్లు తెలిసింది.
మరోవైపు.. మొదటి భార్య కుమారుడికి తలకొరివి పెట్టే అవకాశం ఇవ్వాలని చంద్రయ్య కుమార్తెలు కోరినట్లు సమాచారం. దీంతో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. స్థానికులు రెండో కోడలికి మద్దతుగా నిలిచినట్లు తెలిసింది.
పోలీసులకు ఫిర్యాదు
ఆస్తి విషయంలో వివాదం ముదరడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. తలకొరివి పెట్టే విషయంలో తలెత్తిన వివాదంతో అంత్యక్రియలు ఆలస్యమైనట్లు తెలిసింది. సోమవారం మృతిచెందిన చంద్రయ్య అంత్యక్రియలు బుధవారం పూర్తయ్యాయి. మృతుడి అంత్యక్రియల సమయంలో ఆస్తి వివాదం తెరపైకి రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.









