Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ కాలేదా.. అయితే ఇలా చేయండి..!

Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ కాలేదా.. అయితే ఇలా చేయండి..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఎకరానికి 12,000 రూపాయలను పెట్టుబడి సహాయంగా అందజేసే ఈ పథకం మొదటి విడత 6000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేస్తుంది. జనవరి 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలోని ప్రతి మండలంలో మండలానికి ఒక గ్రామం చొప్పున మొదటి విడతగా 4.41 లక్షల మంది రైతులకు 569 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసి జనవరి 27వ తేదీన వారి వారి ఖాతాలో డబ్బులు జమ చేశారు. అదేవిధంగా ఫిబ్రవరి 5వ తేదీన 17.03 లక్షల మంది రైతులకు ఎకరం లోపు ఉన్న రైతులకు 557 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు వారి వారి ఖాతాలలో జమ చేశారు.
మూడవ విడుత రెండు ఎకరాల లోపు ఉన్న 13.24 లక్షల మంది రైతులకు ఫిబ్రవరి 10వ తేదీన 1092 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఇప్పటివరకు 34.69 లక్షల మంది రైతులకు ఇప్పటివరకు 2218.49 కోట్ల రూపాయల రైతు భరోసా వారి వారి ఖాతాలలో జమ అయ్యింది.
రైతు భరోసా అందలేదా..?
అన్ని అర్హతలు ఉండి రైతు భరోసా నిధులు మీ ఖాతాలలో జమ కాలేదా.? కొంతమంది రైతులకు రైతు భరోసా నిధులు రాలేదని ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం సూచన చేసింది. రైతు భరోసా నిధులు రాలేదని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రైతు భరోసా వారి వారి ఖాతాలలో రాని రైతులు ఒకసారి బ్యాంకులకు వెళ్లి చెక్ చేసుకోవాలని తెలిపింది.
ఖాతా, కేవైసీ కరెక్ట్ గా ఉందా..? లేదా..? అని చెక్ చేసుకోవాలి. అయినా కూడా రాలేదని తెలిస్తే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని కలిసి వివరాలు వెల్లడించాలని కోరింది. మీ దరఖాస్తులలో పొరపాట్లు ఉంటే వ్యవసాయ విస్తరణ అధికారులు వెంటనే సరిచేసి ఆన్ లైన్ లో పొందుపరుస్తారు. ఆ తర్వాత రైతు భరోసానిధులు మీ మీ ఖాతాలలో జమవుతాయి.
SIMILAR NEWS :









