TOP STORIESBreaking Newsవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా నిబంధనలు ఫిక్స్.. ఇక వారికే పెట్టుబడి సహాయం..!

Rythu Bharosa : రైతు భరోసా నిబంధనలు ఫిక్స్.. ఇక వారికే పెట్టుబడి సహాయం..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రైతులకు పెట్టుబడి సహాయం అందించడానికి నిబంధనలు ఖరారు చేసినట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుబంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.

హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి రైతులకు సహాయం చేయలేదని, ప్రతిపక్షాల నుంచి, రైతుల నుంచి విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.

గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకంలో లోపాలను సరిదిద్దడానికి ఆలస్యమైనట్లుగా అధికారులు పేర్కొంటున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో కొండలు, గుట్టలు, సాగుకు యోగ్యం కానీ భూములకు సైతం పెట్టుబడి సహాయం అందజేసి ప్రభుత్వ నిధులు దుబారా చేశారు. దాంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడింది.

కాగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారు అలా కాకుండా సాగుకు యోగ్యమైన భూములకే రైతు భరోసా అందించాలని ఉద్దేశంతో కసరత్తు నిర్వహిస్తున్నారు. రైతుల నుంచి అభిప్రాయ సేకరణ సైతం చేశారు. ఇటీవల రైతుల సూచనలు తీసుకున్న ప్రభుత్వం నిబంధనలను ఖరారు చేసినట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా 1.29 కోట్ల ఎకరాలు సాగు చేస్తున్నట్లు సూచనప్రాయంగా తెలుస్తోంది. సాగు చేస్తున్న పంటలకే రైతు భరోసా అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. రైతు భరోసా పథకం ద్వారా ఏటా ఎకరానికి 15 వేల రూపాయలను అందించనున్నారు.

వాటిలో వానాకాలం సీజన్ లో ఎకరానికి రూ.7500, యాసంగి సీజన్ లో రూ.7500 అందించనున్నారు. ఇది ఇలా ఉండగా రైతుల నుంచి తీసుకున్న అభిప్రాయ సేకరణ ప్రకారం.. ఏడున్నర ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా పథకాన్ని అందించాలని నిర్ణయించినట్లు సమాచారం.

పేద రైతులే ఎక్కువగా పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూస్తారని.. అందుకు గాను ఏడున్నర ఎకరాలను కట్ ఆఫ్ గా నిర్ణయించినట్లు తెలుస్తుంది. నిబంధనలు ఖరారు కాగా దసరా నాటికి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి రైతుల ఖాతాలలో ఈ వానాకాలం సీజన్ కు గాను ఎకరానికి 7500 చొప్పున జమ చేసే అవకాశాలు ఉన్నాయి.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు