అన్నదాత కు గుండె కోత.. చేతికొచ్చిన పంట కళ్లముందే కరవుపాలు..!
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామంలో కరవు రక్కసి కోరలు చాచింది. ఆకాశం దిక్కుచూసి విసిగిపోయిన అన్నదాతకు ఈ ఏడాది కరవు గుండెకోతను మిగిల్చింది.

అన్నదాత కు గుండె కోత.. చేతికొచ్చిన పంట కళ్లముందే కరవుపాలు..!
పోచంపల్లిలో అన్నదాతల కంటతడి
వర్షాల్లేక ఎండిపోతున్న సాగు పొలాలు
లక్షల్లో నష్టపోయిన కౌలు రైతులు
• ఏఎమ్మార్ కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలని డిమాండ్
(గుర్రంపోడు – యాలాద్రి, మన సాక్షి )
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామంలో కరవు రక్కసి కోరలు చాచింది. ఆకాశం దిక్కుచూసి విసిగిపోయిన అన్నదాతకు ఈ ఏడాది కరవు గుండెకోతను మిగిల్చింది. చేతికొచ్చిన పంట కళ్లముందే ఎండిపోతుండటంతో రైతులు పొలాల గట్లపైనే కూర్చుని కంటతడి పెడుతున్నారు. సాగునీరు అందక, వర్షాలు కురవక వందలాది ఎకరాల్లో పంటలు నిలువునా ఎండిపోతున్నాయి.
పోచంపల్లి గ్రామానికి చెందిన బొంగరాల శ్రీను అనే కౌలు రైతు కథ ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. వర్షాలు పడతాయన్న ఆశతో, కష్టాన్ని నమ్ముకుని మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేశాడు. పంట బాగా పండి అప్పులు తీరుతాయనుకున్న తరుణంలో, సాగునీరు లేక పంట మొత్తం ఎండిపోయింది.
Also Read : కేబినెట్‌లో కూర్చుంటే రైతుల కష్టాలు అర్థం కావు.. బి.వి. రాఘవులు
దీనికోసం చేసిన లక్షలాది రూపాయల పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరైంది. చేతికొచ్చే సమయంలో పంట పూర్తిగా నాశనం కావడంతో శ్రీను కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. ప్రభుత్వం మా గ్రామ రైతులు నా ఆదుకోవాలని, పోచంపల్లి గ్రామానికి ఏఎమ్మార్ కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తేనే తమ బతుకులు బాగుపడతాయని గ్రామ రైతులు స్పష్టం చేస్తున్నారు.
ఈ పథకం ద్వారా గ్రామానికి నీరందిస్తే కరవును శాశ్వతంగా తరిమికొట్టవచ్చని చెబుతున్నారు. ప్రభుత్వం, నీటిపారుదల శాఖ అధికారులు తక్షణమే స్పందించి పోచంపల్లికి ఎత్తిపోతల పథకం మంజూరు చేయాలని, తీవ్రంగా నష్టపోయిన కౌలు రైతు బొంగరాల శ్రీనుతో పాటు మిగిలిన రైతులను ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.








