Nalgonda : ప్రశ్నిస్తే బ్యాంకు చుట్టూ తిప్పుతాం.. రైతులను హడలెత్తిస్తున్న బ్యాంకు మేనేజర్..!
Nalgonda : ప్రశ్నిస్తే బ్యాంకు చుట్టూ తిప్పుతాం.. రైతులను హడలెత్తిస్తున్న బ్యాంకు మేనేజర్..!
కనగల్, మన సాక్షి :
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది. మూడు విడతలుగా రుణమాఫీ ఆగస్టు 15వ తేదీతో ముగిసింది. దాంతో రైతులంతా బ్యాంకుల వైపు పరిగెడుతున్నారు. నిరక్షరాస్యులు అయిన రైతుల పట్ల బ్యాంకు అధికారులు సహనంతో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వారికి పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వాల్సింది పోయి ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ వారిని బ్యాంకుల చుట్టూ తిప్పుతూ హడలెత్తిస్తున్నారు. రుణమాఫీ జాబితాలో పేరు వచ్చిన రైతు కూడా రోజుల తరబడి బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది.
నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలోని ఏపీజీవీ బ్యాంక్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులను హడలెత్తిస్తున్నారు. ప్రభుత్వం మూడు విడతల్లో రైతులకు రుణమాఫీ చేయడంతో బ్యాంకుల వద్దకు రైతులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో బ్యాంకు సిబ్బంది సంయమనం కోల్పోయి ప్రవర్తిస్తున్న తీరుతో ఖాతాదారులు, రుణమాఫీ గ్రహీతలు ఇబ్బందులకు గురవుతున్నారు.
సాధారణంగా గ్రామీణ ప్రాంతం కావడంతో ఎక్కువమంది రైతులు, ఖాతాదారులు నిరక్షరాస్యులు. బ్యాంకు పాస్ బుక్ తీసుకుని సిబ్బంది దగ్గరికి వెళ్లి ఏదైనా అడిగితే కసురుకుంటూ సమాధానం ఇవ్వడంతో ఖాతాదారులు విస్తుపోతున్నారు.
బ్యాంకు సిబ్బంది లోపాలను ప్రశ్నిస్తే కొత్తగా వచ్చిన ఏపీజీవీబీ బ్రాంచ్ మేనేజర్ ప్రశ్నించే వారిపై ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నాడు. ప్రశ్నించే వాళ్లను ఎక్కువ రోజులు బ్యాంకు చుట్టూ తిప్పండి అంటూ కింది సిబ్బందికి హుకుం జారీ చేస్తున్నాడు.
బ్యాంకు మేనేజర్ అనే స్థాయిని కోల్పోయి రైతులు, ఖాతాదారులపై అరుస్తుండడంతో ఈ మేనేజర్ మా వద్దంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇంట్లోంచి డబ్బులు ఇచ్చినట్టు బ్యాంకు సిబ్బంది మాట్లాడుతుండడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
జీతాలు తీసుకుంటూ ఖాతాదారులకు సేవ చేయాల్సిన బ్యాంకు సిబ్బంది నిరంకుశంగా సొంత బ్యాంకు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మొదటి విడత, రెండో విడత రుణమాఫీ అయిన మెజారిటీ రైతులను సైతం కొర్రీలు పెడుతూ ఇప్పటికీ బ్యాంకు చుట్టూ తిప్పుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో స్పష్టమవుతుంది.
ఉన్నతాధికారులు స్పందించి అనుభవ లేమితో వ్యవహరిస్తున్న బ్యాంక్ మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని రైతులు, ఖాతాదారులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి :
దర్జాగా కారులో వచ్చి.. రాత్రికి రాత్రే షాపులన్నీ దోచేశారు, సీసీ పూటేజీలో రికార్డ్..!









