Nalgonda : నల్గొండ జిల్లాలో పండుగ పూట తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..!

Nalgonda : నల్గొండ జిల్లాలో పండుగ పూట తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లిలో దీపావళి పండుగ పూట సోమవారం చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన విషాదఛాయలు అలుముకునేలా చేసింది. ఇద్దరు పసిబిడ్డలను చంపి తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఈ ఉదంతం బతుకుతెరువు కోసం వలస వచ్చిన ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది.
వివరాల్లోకి వెళ్తే…ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా జనకాల గ్రామానికి చెందిన కుంచాల రమేష్, భార్య నాగలక్ష్మి (27), పిల్లలు మోహన్ సాయి (09), అవంతిక (7)లతో కలిసి సుమారు నాలుగు సంవత్సరాల క్రితం ఉపాధి కోసం కొండమల్లేపల్లికి వలస వచ్చారు. అయితే భర్త రమేష్ మద్యపానానికి బానిస కావడం వల్ల కొంతకాలంగా వారి దాంపత్య జీవితంలో కలహాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు తెలిపారు. ఈ గొడవలు తరచుగా జరిగేవి కావడంతో ఆ ఇంట్లో ప్రశాంతత కరువైంది.
మద్యం – మనస్తాపం
ఆదివారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్త కుంచాల రమేష్ కోపంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడమే కాక తన మొబైల్‌ను స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. భర్త తీరు తాగుడుతో నిత్యం ఎదురవుతున్న కష్టాలు భవిష్యత్తుపై ఏర్పడిన అభద్రతాభావం… వెరసి నాగలక్ష్మి తీవ్రమైన మనస్తాపానికి గురైంది.
అంతులేని విషాదం
ఆ క్షణంలో ఏం చేయాలో తెలియని ఆ తల్లి ఆవేశం నిస్సత్తువతో కూడిన ఒక దారుణ నిర్ణయం తీసుకుంది. ముందుగా తన ఇద్దరు కళ్లలాంటి పిల్లలు మోహన్ సాయి, అవంతికలను చంపేసింది. ఆ తర్వాత తాను కూడా ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం ఉదయం ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న కొండమల్లేపల్లి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారు తలుపులు పగలగొట్టి చూడగా నాగలక్ష్మి ఆమె ఇద్దరు పిల్లలు విగతజీవులై పడి ఉన్నారు. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకున్నారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఈ దారుణం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యానికి బానిసైన ఒక వ్యక్తి నిర్లక్ష్యం కుటుంబంలో నెలకొన్న నిత్య కలహాలు చివరికి రెండు పసిప్రాణాలతో సహా ఒక కుటుంబాన్నే బలితీసుకోవడం ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది.
MOST READ :
-
Medicine : ప్రభుత్వ దవాఖానాలో గడువు ముగిసిన మందుల పంపిణీ.. వైద్య సిబ్బందిపై ప్రజల ఆగ్రహం..!
-
Nizamabad : నిజామాబాద్ నగరంలో దారుణం.. కానిస్టేబుల్ ను కత్తితో పొడిచి చంపిన దొంగ..!
-
Nalgonda : ఈ ముఠా మామూలోల్లు కాదు.. అమాయక ప్రజలే వారి టార్గెట్..!
-
Khammam : హోటళ్లు, వ్యాపార సంస్థలో ఆకస్మిక దాడులు.. జరిమానా..!
-
TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మేఘా జాబ్ మేళా.. 150 కంపెనీలు 10 వేల ఉద్యోగాలు..!









