District collector : ఇందిరమ్మ ఇండ్లు మొదటి ప్రాధాన్యత వారికే.. జిల్లా కలెక్టర్ స్పష్టం..!
District collector : ఇందిరమ్మ ఇండ్లు మొదటి ప్రాధాన్యత వారికే.. జిల్లా కలెక్టర్ స్పష్టం..!
దేవరకొండ, మనసాక్షి :
దేవరకొండ డివిజన్ పరిధిలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి అధికారులను ఆదేశించారు. గ్రామాలు, మున్సిపల్ కాలనీలలోని చివరి ఇండ్ల వరకు తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గురువారం జిల్లా కలెక్టర్ దేవరకొండ ఆర్ డి ఓ కార్యాలయంలో దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ తో కలిసి దేవరకొండ డివిజన్ పరిధిలోని మండలాలలో తాగునీరు, ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్, ఆర్ అండ్ ఆర్ భూసేకరణ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
దేవరకొండ మున్సిపాలిటీ తో పాటు, అన్ని గ్రామాలలో డిమాండ్ కు సరిపడ తాగునీటిని సరఫరా చేసే విధంగా మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ,విద్యుత్ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చెప్పారు. ఆయా మండలాల వారిగా తాగు నీటి డిమాండ్, ప్రస్తుతం చేస్తున్న తాగునీటి సరఫరాలను, అలాగే ఎక్కడైనా తాగునీటి సరఫరాకు సరిపడే నీరు లేనట్లయితే ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించి వెంటనే ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు.
దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ మాట్లాడుతూ వర్షాకాలంలో నియోజకవర్గం పరిధిలో అన్ని చెరువులలో నీరు పుష్కలంగా ఉందని, వచ్చే జూన్ వరకు ఎలాంటి తాగు నీటి సమస్య రాకుండా చూడాలని అధికారులతో కోరారు. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలలో తాగునీటికి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అవసరమైతే అద్దె బోర్ల ద్వారా ప్రజలకు త్రాగునీరు అందించాలని, అలాగే తాగునీటి సరఫరాకు అవకాశాలు లేని చోట ప్రత్యామ్నాయ మార్గాలకు ప్రణాళిక రూపొందించాలని, ఎట్టి పరిస్థితులలో ప్రజలు తాగు నీటికీ ఇబ్బంది పడకుండా చూడాలని కోరారు.
ఎక్కడైనా తాగునీటి వనరులు, లేదా బోర్లకు చిన్నచిన్న మరమ్మతులు ఉన్నట్లయితే వాటిని చేపట్టి పూర్తిచేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని, రానున్న మూడు నెలల్లో ఎలాంటి సమస్యలు రాకుండా గ్రామాలు, వార్డుల్లో తిరిగి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. మల్లేపల్లిలో సంపు నిర్మాణంతో పాటు , ఆయా గ్రామాలలో అవసరమైన చోట బోర్లు లీజుకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.
గత వేసవిలో ఆర్ డబ్ల్యూఎస్ , మిషన్ భగీరథ , పంచాయతీరాజ్ అధికారులందరూ బాగా పనిచేసి తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారని ,ఈ సంవత్సరం సైతం అలాగే కృషి చేయాలని కోరారు. కొన్ని గ్రామాలలో తాగునీటి ఫ్లో వ్వాల్సును తొలగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ,దీనివల్ల తాగునీరు వృధా అవుతుందని, దీనిపై గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని, ఒకవేళ ఎవరైనా బలవంతంగా వాల్వులు తీసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు.
ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పై సమీక్ష సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సైట్ క్లియర్ గా ఉన్నచోట తక్షణమే ఫోటోలను తీసి పంపించాలని, ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే తమ దృష్టికి తీసుకురావాలని, ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభించే ముందు మార్కింగ్ చేసి సంబంధిత శాసనసభ్యుల ద్వారా ప్రారంభించాలని ఎంపీడీవోలను ఆదేశించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, మొదటి ప్రాధాన్యతలో పూర్తిగా ఇల్లు లేని వారికి, గుడిసెలో నివసిస్తున్న వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందని, జనవరి 26 న మంజూరు చేసిన జాబితాలు మరోసారి పూర్తి జాగ్రత్తగా పరిశీలించి అర్హులకు మాత్రమే ఇల్లు వచ్చేలా చూడాలని, ఎట్టి పరిస్థితులలో అనర్హులు రాకూడదని తెలిపారు.
మొదటి ప్రాధాన్యత తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్న వారికి ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని, రానున్న నాలుగేళ్లలో ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇస్తుందని తెలిపారు . ఇందిరమ్మ ఇండ్ల బాధ్యత పూర్తిగా ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులదేనని ఆయన అన్నారు.
భూసేకరణ సమీక్ష సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ నక్కలగండి కింద నక్కలగండి తండాలో ఇల్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వలేదని, దీనిపై మరోసారి విచారణ జరిపించి వారికి న్యాయం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ తో కోరగా, ఈ విషయంపై ప్రభుత్వ నిబంధనలను మరోసారి పరిశీలించి 10 రోజుల్లో విచారించి తగు చర్య తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
పెండ్లి పాకల ప్రాజెక్టు కింద నాలుగు గ్రామాలలో ముంపు సందర్భంగా సర్వే సమయంలో నిర్మాణాలకు సంబంధించిన విలువను సరిగా చేయలేదని, అందువల్ల న్యాయపరంగా ఆ గ్రామాలలో ఇండ్లు నష్టపోయిన వారికి పరిహారం వచ్చేలా చూడాలని కలెక్టర్తో ఎం ఎల్ ఏ కోరారు. గుడి తండా, కారోబార్ తాండ తదితర గ్రామాలలో భూసేకరణ సమస్యలను ఈ సమావేశంలో చర్చించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, దేవరకొండ అడిషనల్ ఎస్పీ మౌనిక, దేవరకొండ ఇన్చార్జి ఆర్డీవో శ్రీదేవి, దేవరకొండ మున్సిపల్ కమిషనర్, మిషన్ భగీరథ ,ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్,విద్యుత్, అధికారులు, తహసిల్దారులు, ఎంపీడీవోలు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. 134 మంది పంచాయతీ కార్యదర్శులకు చార్జ్ మెమో..!
Ration Cards : రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్..!
TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి డబ్బులు..!









