Karimnagar : కరీంనగర్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం..!
కరీంనగర్ నగరంలో ట్రాఫిక్ నిబంధనల అమలు, నేరాల నియంత్రణ, మరియు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

Karimnagar : కరీంనగర్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం..!
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ నగరంలో ట్రాఫిక్ నిబంధనల అమలు, నేరాల నియంత్రణ, మరియు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వన్‌టౌన్ కార్నర్ వద్ద చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్లు, తప్పుగా అమర్చిన నంబర్ ప్లేట్లు, అలాగే అసలు నంబర్ ప్లేట్లే లేని వాహనాలపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి ఆధ్వర్యంలో, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సంజీవ్, అంజయ్య మరియు తమ సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో మొత్తం 115 వాహనాలను సీజ్ చేశారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం సంబంధిత నిబంధనల మేరకు జరిమానాలు విధించడంతో పాటు, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించి కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి మాట్లాడుతూ, ప్రతి వాహనానికి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా స్పష్టంగా కనిపించే హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. నంబర్ ప్లేట్లను మార్చడం, స్టిక్కర్లు లేదా ఇతర డిజైన్లతో నంబర్లు కనిపించకుండా చేయడం, నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని ఆయన హెచ్చరించారు.
ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లతో పాటు ట్రాఫిక్ ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.









