Karimnagar : కరీంనగర్ లో నిరుద్యోగుల భారీ ర్యాలీ..!
రాబోయే పోలీస్ నోటిఫికేషన్‌లో నిరుద్యోగ అభ్యర్థులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గీతాభవన్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

Karimnagar : కరీంనగర్ లో నిరుద్యోగుల భారీ ర్యాలీ..!
20వేల ఉద్యోగాల భర్తీ, వయోపరిమితి పెంపునకు డిమాండ్
కరీంనగర్, మనసాక్షి :
రాబోయే పోలీస్ నోటిఫికేషన్‌లో నిరుద్యోగ అభ్యర్థులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గీతాభవన్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. సామాజిక కార్యకర్త కోట శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ యువకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కోట శ్యామ్ కుమార్ మరియు నిరుద్యోగ అభ్యర్థులు మాట్లాడుతూ.. నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా రాబోయే నోటిఫికేషన్‌లో పూర్తి స్థాయిలో 20,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘ కాలంగా నోటిఫికేషన్లు లేకపోవడం వల్ల ఎంతోమంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయే పరిస్థితిలో ఉన్నారని, కావున అభ్యర్థుల వయోపరిమితిని తక్షణమే పెంచాలని కోరారు.
అలాగే అభ్యర్థుల్లో గందరగోళం లేకుండా స్పష్టమైన జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు బెల్లపు కరుణాకర్, అన్నమల్ల సురేష్‌లతో పాటు ఉద్యోగ అభ్యర్థులు శ్రీకాంత్, బాలు, సాయి మరియు పెద్ద సంఖ్యలో మహిళా అభ్యర్థులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.











