Karimnagar : పోలీసుల ఆపరేషన్.. 105 వాహనాలు స్వాధీనం..!

Karimnagar : పోలీసుల ఆపరేషన్.. 105 వాహనాలు స్వాధీనం..!
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్‌లో మరియు వినాయక నగర్ లో బుధవారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో పలు అంశాలపై తనిఖీలు కొనసాగినవన్నారు. పాత నేరస్థులు అద్దెకు ఇల్లు తీసుకుని నివసిస్తున్నారా అని ఆరాదీశారు.
సరైన ధృవపత్రాలు లేని 105 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 77 బైకులు, 27 ఆటోలు, ఒక ట్రక్ ఉన్నాయి. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు స్థానిక ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు జరుగుతున్న తీరును వివరించి, సైబర్ నేరానికి గురైనట్లయితే వెంటనే స్పందించి, నేరం జరిగిన గంట లోపల 1930 నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా తస్కరించబడిన సొమ్మును ఫ్రీజ్ చేసి తిరిగి పొందవచ్చని తెలిపారు.
మాదక ద్రవ్యాలను దుర్వినియోగం చేయడం, వాటిని అక్రమంగా రవాణా చేయడం, అమ్మకం, వినియోగించడం చట్ట ప్రకారం నేరం అని పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాకుండా, వాటి వలన కలిగే దుష్పరిణామాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని అడిషనల్ డీసీపీ హెచ్చరించారు.
శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వ్యక్తులపై సమాచారం అందించాలని ప్రజలను కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100 ద్వారా లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, సీఐ లు బిల్లా కోటేశ్వర్, ప్రదీప్, సంజీవ్, సదన్ కుమార్ తో పాటు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.









