TOP STORIESBreaking Newsజాతీయంపండుగలు

Sankranti : తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి.. సంతోషాల సంకేతం.. సంక్రాంతి సందేశం..!

Sankranti : తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి.. సంతోషాల సంకేతం.. సంక్రాంతి సందేశం..!

పండగ.. ఎన్నో విశేషాల సమాహారం. నవ జీవనానికి నాంది పలుకుతుంది.

శాస్త్రీయత, సంస్కృతి, సంప్రదాయాల కలబోత.

మన సాక్షి:

రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతిని అప్పాల పండగగా చెబుతారు. పోషకాలున్న పిండివంటలు.. నోరూరిస్తాయి. అప్పాలు, చేగోళ్లు, సఖినాలు, మురుకులు, నువ్వుల ముద్దలు, అరిసెలు, తదితర ఎన్నో ప్రత్యేకతలతో ప్రతి ఊరూవాడ గుమగుమలను పంచుతుంది.

అటుగా వెళ్లే వారిని పిండివంటలు నోరూరిస్తాయి.. పండగలో మరో విశేషం రంగవల్లికలు. మహిళలు ముచ్చటగా ముంగిళ్లను తీర్చిదిద్దుతుంటారు. ప్రతి వాకిలి.. కొత్తందాలను పంచుతుంది. వారి నైపుణ్యం బహిర్గతమవుతుంది.

అన్ని రంగాల్లో రాణిస్తున్న ఎంతోమంది మగువలు.. నేటి తరానికి స్ఫూర్తిదాయకం. వారు సాధికారత వైపు పయనించేందుకు అండగా నిలవాలి. మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చేదే మకర సంక్రాంతి. నేడు.. సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతారు. ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరిస్తే.. నిత్యం పండగే.

ఇందుకు కావాల్సిందిల్లా.. కుటుంబ సభ్యుల్లో సఖ్యత, ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం. చిన్నపాటి కారణాలతో దూరమవుతున్న జంటల సంఖ్య ఉమ్మడి పెరుగుతోంది. ఇందులో మార్పు రావాలి. స్వర్గధామంగా మార్చుకోవడానికి సమష్టిగా అడుగేయాలి. అప్పుడే అసలైన క్రాంతి.

లక్ష్యం లేని యువత దారం లేని పతంగితో సమానం :

గాలిపటం రెపరెపల మాదిరి.. యువత తమ ప్రత్యేకతను చాటాలి. జీవితంలో రాణించాలంటే.. నచ్చిన రంగం అగ్రగామిలో నిలవాలంటే నైపుణ్యం తప్పనిసరి. మూడు నెలల్లో పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. సాధించాలనే పట్టుదల ఉంటేనే లక్ష్యాన్ని చేరవచ్చు. లేదంటే దారం లేని పతంగి మాదిరి గమ్యమంటూ ఉండదు.

సంప్రదాయాన్ని కాపాడుకుందాం :

పతంగుల రెపరెపలు.. రంగురంగుల ముగ్గులు.. నోరూరించే పిండివంటలు.. డూడూ బసవన్నల ప్రదర్శనలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతల సమాహారం సంక్రాంతి. అన్నీ సంతోషాన్ని పంచేవే. పండగ వేళ డూడూ బసవన్నల విన్యాసాలు ప్రత్యేకం. గంగిరెద్దులతో ఆట ఆకట్టుకుంటుంది.

హరిదాసులు ప్రత్యేక ఆకర్షణ. మరోవైపు కాలానుగుణంగా వస్తున్న మార్పులతో వారి సంఖ్య తగ్గుతోంది. నాటి సంప్రదాయం కనుమరుగవుతోంది. ఈ తరుణంలో ప్రతి ఒక్కరు కళను, కళాకారులను ఆదరించాల్సిన అవసరం ఉంది.

Reporting : Pranay, Nizamabad 

MOST READ : 

మరిన్ని వార్తలు