Nalgonda : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి.. మంత్రుల ఉమ్మడి ప్రకటన..!
Nalgonda : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి.. మంత్రుల ఉమ్మడి ప్రకటన..!
నలగొండ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో నల్గొండ జిల్లాను ముందుకు తీసుకు వెళ్లేందుకు తనవంతు కృషి చేస్తానని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బుధవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఉదయాదిత్య భవన్ లో నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.
వ్యవసాయ సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటుందని, ప్రతిరోజు రైతులకు సంబంధించిన అంశాలపై మండల స్థాయి అధికారులతో జిల్లా అధికారి పర్యవేక్షణ చేయాలన్నారు. రైతు భరోసా, రైతు బీమా, ఎరువులు, విత్తనాల విషయంలో ప్రత్యేక దృష్టి నిలపాలని చెప్పారు. గత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసిందని, అలా కాకుండా తమ ప్రభుత్వం రైతులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రైతు భరోసా వంటి ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు.
జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటిని పూర్తిచేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఇరిగేషన్ ప్రాజెక్టులు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు శాసనసభ్యుల విజ్ఞప్తుల మేరకు సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి పక్షం రోజులకు ఒకసారి సమీక్ష సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాడ ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 14న రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరిలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అప్పటివరకు రేషన్ కార్డుల కై వచ్చిన దరఖాస్తులన్నింటిని ఈనెల 13 లోగా పరిశీలించి అర్హులైన వారందరినీ ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు గొప్ప చరిత్ర ఉందని,జిల్లా ప్రజాప్రతినిధులు ,అధికారులు అందరూ కలిసి ఉమ్మడి జిల్లాను ఒక స్థాయికి తీసుకు వెళ్తామని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రాజక్టు లన్నింటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని, ప్రాజెక్టుల భూసేకరణ పై శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి నిలపాలని కోరారు. ఎస్ఎల్బీసీ పనుల పునః ప్రారంభానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నామని, భారత సైన్యం లో పనిచేసిన అధికారులను డిప్యూటేషన్ పై తీసుకొని ఎలక్ట్రో మాగ్నెటిక్ లీడర్ సర్వే నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
డిండి, హెచ్ ఎల్ సి లైనింగ్ , నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ బునియాధిగాని కాలువ, పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువలను పూర్తి చేస్తామని అయితే వీటి భూసేకరణను పూర్తి చేసే విషయంపై శాసనసభ్యులు దృష్టి నిలపాలని కోరారు. అధికారులు ఆయా పథకాలకు లబ్ధిదారులు ఎంపికలో అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలని, నిజాయితీ, పారదర్శకతతో ప్రజలకు కనిపించేలా పని చేయాలని, నెలలో రెండుసార్లు సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆర్ అండ్ బి ద్వారా నల్గొండ జిల్లాకు ఎక్కువ నిధులు తేవడం జరిగిందని, భవిష్యత్తులో మరిన్ని నిధులు ఇచ్చేందుకు కృషి చేస్తానని 45 కోట్లతో సంగెం బ్రిడ్జికి మంజూరు ఇవ్వడం జరిగిందని, నల్గొండ -మల్లేపల్లి -దేవరకొండ రహదారులను హామ్ రోడ్ కింద మంజూరు చేశామని, రాష్ట్రవ్యాప్తంగా 1200 కోట్ల రూపాయలతో అన్ని మండల కేంద్రాల నుండి జిల్లా కేంద్రాలకు హాం పథకం కింద డబుల్ రోడ్ల నిర్మాణానికి మంజూరు చేయడం జరిగిందని, పంచాయతీరాజ్ రోడ్లను సైతం హామ్ కింద కు తీసుకొస్తున్నట్లు తెలిపారు.
ఎస్ ఎల్ బి సి, టన్నెల్ పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ,ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ పై ప్రత్యేకంగా రివ్యూ చేస్తామని ,ఇన్చార్జి మినిస్టర్ జిల్లాకు ఎక్కువ సమయం కేటాయించాలని, ప్రాథమిక వైద్యం, విద్య ప్రభుత్వానికి అతి ముఖ్యమైనవని, వీటిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని , విద్యలో భాగంగా ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ పనులను త్వరలోనే ప్రారంభం చేయనున్నామని తెలిపారు.
అధికారులు క్షేత్రస్థాయిలో బాగా పనిచేయాలని, ఎస్డిఎఫ్ కింద ప్రతి ఎమ్మెల్యేలకు తక్షణమే ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని , ఇందుకు సంబంధించి టోకెన్లు రైజ్ చేయాలని ఎమ్మెల్యేలతో కోరారు. ఎనిమిది నెలల్లో నల్గొండ కలెక్టరేట్లో చేపట్టిన అదనపు బ్లాకు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.రాచకాలవల గుర్రపుడెక్కలతో నిండిపోయిందని, ఈ కాల్వ పై సమన్వయ లోపం ఉందని, అలాగే నిర్వహణకు నిధులు లేవని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చమల కిరణ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ చిత్రియాల్, రాములోరి బండ లిఫ్ట్ ల గురించి మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
ప్రభుత్వ విప్ , ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ కాలేశ్వరం 15వ ప్యాకేజీ 8 కిలోమీటర్ల కాలువ తవ్వితే 20 చెరువులకు నీరు వస్తుందని, అందువల్ల కొత్త డి పి ఆర్ కు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే రుణమాఫీకి సంబంధించి ఏపీజీవీబీ బ్యాంకులో ఖాతాలు ఉన్న రైతులకు ఐఎఫ్ఎస్ సి కోడ్ సమస్య వల్ల నిధులు వెనక్కి వెళ్ళాయని, ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.బస్వాపూర్ పునరావస కేంద్రానికి నిధులు ఇవ్వాలని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కోరగా, నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు .
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టు ట్రాన్స్కో బిల్లులను మంజూరు చేయాలని, గుర్రంపోడు బస్టాండు ఏర్పాటు విషయమై ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ 20 ఫీట్లు వెనక్కి జరపాలని, డొంకతండ, బోయ గూడెం గ్రామాలలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల స్వీకరించిన దరఖాస్తులు కనిపించడం లేదని, వెబ్సైట్ ను మరోసారి ఓపెన్ చేయించి ప్రజల నుండి మరోసారి దరఖాస్తులు తీసుకోవాలని నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి కోరారు.
రాచకాలువకు ఇన్చార్జి ఇంజనీరింగ్ అధికారిని నియమించాలని, రుద్రమదేవి చెరువు 800 మీటర్లు తీస్తే చెరువు నిండుతుందని అందువల్ల వీటిపై దృష్టి సారించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ కోరిన మేరకు మంత్రి వెంటనే ఈ విషయంపై చర్య తీసుకుంటామని తెలిపారు.దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ పెండ్లిపాకల ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడారు.
నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్లేముల భూసేకరణకు నిధులు మంజూరు చేయాలని, ఐటిపాముల భూసేకరణ పూర్తి చేయాలని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల కు శంకుస్థాపన చేయాలని, రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ మునుగోడు పరిధిలోని శివన్న గూడెం ఇతర ప్రాజెక్టులను పూర్తి చేయాలని, రెండో విడత ఎక్కువ మందికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ,ఇదివరకే బేస్మెంట్ నిర్మించుకున్న వారికి సడలింపు ఇవ్వాలని ,సంస్థాన్ నారాయణపూర్ లో ఇసుక కొరత ఉందని ఆ సమస్యను పరిష్కరించాలని, ప్రైవేట్ ఆస్పత్రులు, విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలని కోరారు.
సమావేశం ప్రారంభమైన వెంటనే నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, నీటిపారుదల ,విద్య, వ్యవసాయం, వైద్యం ,ఆరోగ్యం, భూభారతి, మహిళా శక్తి, సంక్షేమం తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశానికి వివరించారు .ఉమ్మడి జిల్లా వ్యవసాయ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వారి శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.
ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ,మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ,నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, తదితరులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.
MOST READ :
-
Miryalaguda : సిపిఆర్ తో రైతును కాపాడిన 108 సిబ్బంది..!
-
Paddy Cultivation : బురద పొలాలు, వరినాట్లు లేవు.. ఇక అంతా పొడి దుక్కిలో వరి విత్తనాలు ఎద పెట్టడమే.. అది ఎలాగో తెలుసుకుందాం..!
-
Chervugattu : మాస్టర్ ప్లాన్ ప్రకారం చెర్వుగట్టు అభివృద్ధి..!
-
Mahindra : అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ ప్రవేశపెడుతున్న మహీంద్రా..!










