బతుకమ్మ నిధుల కోసం బీఆర్‌ఎస్ పోరు.. మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..!
బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో నగరపాలక సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు శుక్రవారం కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయ ముట్టడికి యత్నించాయి.

బతుకమ్మ నిధుల కోసం బీఆర్‌ఎస్ పోరు.. మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..!
రూ.66 లక్షలు కేటాయించాలని డిమాండ్..
కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.
కరీంనగర్ బ్యూరో , మనసాక్షి :
బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో నగరపాలక సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు శుక్రవారం కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయ ముట్టడికి యత్నించాయి. నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం, నగరపాలక సంస్థ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో పలువురు కిందపడి గాయాలపాలయ్యారు. అనంతరం పోలీసులు బీఆర్‌ఎస్ శ్రేణులను అరెస్టు చేసి పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి తరలించారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ, దసరా, ఉగాది తదితర పండుగలను ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసేవారని పేర్కొన్నారు. పండుగలకు నెల రోజుల ముందే అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఆడపడుచులు ఇబ్బందులు లేకుండా వేడుకల్లో పాల్గొనేలా చర్యలు తీసుకునేవారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పండుగల నిర్వహణపై నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు. జనవరిలోనే విడుదలయ్యే క్యాలెండర్‌లో బతుకమ్మ, దసరా, రంజాన్ తదితర పండుగల తేదీలు స్పష్టంగా ఉంటాయని, అయినా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. పండుగ సమీపించిన తర్వాత టెండర్లు నిర్వహించడం వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యే సమయానికీ ఏర్పాట్లు పూర్తికాకపోవడం ఆందోళనకరమన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు నగరంలో తగిన ఏర్పాట్లు చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పలు ప్రాంతాల్లో వీధి దీపాలు సరిగా వెలగకపోవడంతో మహిళలు చీకట్లోనే బతుకమ్మ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పనిచేయని వీధి దీపాలకు వెంటనే మరమ్మతులు చేపట్టి, అవసరమైన చోట కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
పండుగల నిర్వహణలో కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. నగరంలో వీధి దీపాలు, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి మూడు రోజుల్లోగా పండుగ ఏర్పాట్లను పూర్తి చేసేలా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని బీఆర్‌ఎస్ శ్రేణులు డిమాండ్ చేశాయి.
ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతుకమ్మ, దసరా వేడుకలను ఆనందంగా జరుపుకునేలా చర్యలు చేపట్టాలని కోరాయి. పండుగల నిర్వహణలో నిర్లక్ష్యం కొనసాగితే ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాయి. ప్రజల పండుగలను రాజకీయాలకు అతీతంగా ఘనంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు నగరపాలక సంస్థపై ఉందని పేర్కొన్నాయి.
ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్ గౌడ్, కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, జమ్మూ, యూసుఫ్, నలువాల రవీందర్, గాదె రూపా శ్రీనివాస్, ప్రదీప్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు గందె మాధవీ మహేష్, జంగిలి ఇలెండర్ యాదవ్, ఎడ్ల సరిత అశోక్, సోనూ సింగ్, కర్ర సూర్యశేఖర్, గంటల రేణుక తదితరులు పాల్గొన్నారు.











