District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. డిండి ఎత్తిపోతల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి..!
డిండి ఎత్తిపోతుల పథకం కింద భూసేకరణ, పునరావాస సమస్యలను అధిగమించి పనులు త్వరితగతిన పూర్తి చేసేలా ఇంజనీరింగ్ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. డిండి ఎత్తిపోతల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి..!
నల్లగొండ, మన సాక్షి :
డిండి ఎత్తిపోతుల పథకం కింద భూసేకరణ, పునరావాస సమస్యలను అధిగమించి పనులు త్వరితగతిన పూర్తి చేసేలా ఇంజనీరింగ్ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా, గుండ్లపల్లి (డిండి) మండలం డిండి సమీపంలోని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు డిండి రిజర్వాయర్ ను సందర్శించారు. అనంతరం డిండిలోని ఇరిగేషన్ శాఖ అతిథి గృహంలో ఇంజనీరింగ్ అధికారులతో నిర్మాణంలో ఉన్న డిండి ఎత్తిపోతల పథకం పై సమీక్ష నిర్వహించారు.
ఇంజనీరింగ్ అధికారుల ద్వారా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ వివరాలను అడగ్గా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములు, ఎలమందయ్య, యాదన్ కుమార్ లు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ వివరాలను జిల్లా కలెక్టర్ కు తెలియజేస్తూ మూడు లక్షల 41 వేల ఎకరాలకు సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకం పనులను 6190 కోట్ల రూపాయలతో చేపట్టడం జరిగిందని, భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ తదితర పనులకు ఇప్పటివరకు 4450 కోట్ల రూపాయల చెల్లింపులు సైతం పూర్తయినట్లు తెలిపారు.
హెడ్ వర్క్ కు సంబంధించి ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్నందున పనులు ఊపందుకున్నాయని, 7 ప్యాకేజీలలో ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రాజక్ట్ పనులలో భాగంగా అక్కడక్కడ భూ సేకరణ సమస్యలు, ఆర్ అండ్ ఆర్ సమస్యలు ఉన్నట్లు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ భూసేకరణ చెల్లింపులు, పెండింగ్ ఆర్ అండ్ ఆర్ సమస్యలన్నింటిని తనకు సమర్పించాలని ఆదేశించారు. అవార్డు జారీ చేసినప్పటికీ ఇంకా ఎక్కడైనా చెల్లింపులు జరగని చోట త్వరగా పూర్తిచేయాలన్నారు. అలాగే భవిష్యత్తు భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ చెల్లింపులపై కూడా పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా ఆయన ఆదేశించారు. దేవరకొండ ఆర్ డివో రమణారెడ్డి , ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు హాజరయ్యారు.









