Miryalaguda : మిర్యాలగూడలో మంత్రులు సుడిగాలి పర్యటన.. రూ.171 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..!

Miryalaguda : మిర్యాలగూడలో మంత్రులు సుడిగాలి పర్యటన.. రూ.171 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. సోమవారం అయన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డితో కలిసి మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 171.5 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు .
శెట్టిపాలెం నుండి అవంతిపురం వరకు 74 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నాలుగు లైన్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. 15 కోట్ల రూపాయల టి ఎఫ్ యు ఐ డి సి నిధులతో చేపట్టిన రోడ్డు , 16 కోట్ల రూపాయల టి ఎఫ్ యు ఐ డి సి నిధులతో చేపట్టిన సిసి రోడ్డు ,మురికి కాలువలను ప్రారంభించారు.
మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో41 కోట్ల రూపాయల బీటీ, సీసీ రోడ్డు పనులను,15 కోట్ల రూపాయల వ్యయంతో మిర్యాలగూడ నుండి తడకమళ్ళ వరకు ఉన్న డబుల్ రోడ్డు ను 6 లైన్లుగా మార్చే పనులకు, మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లైఓవర్ ఏరియా, మున్సిపాలిటీ ఏరియా, మున్సిపాలిటీ ఆఫీసు ఏరియా సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు.
5 కోట్ల రూపాయల వ్యయంతో కేఎన్ఎమ్ డిగ్రీ కళాశాలలో నిర్మించిన అదనపు భవనాన్ని , అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల లో 2.25 కోట్ల రూపాయలతో నిర్మించిన అదనపు భవనాన్ని మంత్రులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాలలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో సాగునీరు అందించే ఆయకట్టు లో ఎక్కడా సమస్యలు లేకుండా నీరిస్తామని, అలాగే మొదలుపెట్టిన అన్ని ఎత్తిపోతల పథకాలను నూటికి నూరు శాతం పూర్తి చేస్తామని, మిర్యాలగూడ అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు .
రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి తామందరము కట్టుబడి ఉన్నామని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యాన్ని ఇస్తున్నామని, గత ప్రభుత్వం పది సంవత్సరాలలో ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదని,తాము అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామని, ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి కూడా రేషన్ కార్డులు ఇస్తామని, ధాన్యం సేకరణలో భాగంగా ప్రతి గింజను కొంటామని, ప్రతి వరి రైతుకు న్యాయం చేస్తామన్నారు.
ధాన్యం అమ్మిన రైతుల ఖాతాలలో 72 గంటల్లో నిధులు జమ చేస్తున్నామని, ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, సమాజంలో అన్ని వర్గాల మేలు కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని ,ఎస్సీ వర్గీకరణ పూర్తి చేశామని, 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు దృఢ సంకల్పంతో ఉన్నామని, సామాజిక న్యాయం సంకల్పంతో ముందుకెళ్తున్నామని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలో మెయిన్ కెనాల్ లైనింగ్ కి 57 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అంతేకాక నియోజకవర్గంలోని దుబ్బ తండ, శాంతినగర్, రావులపెంట చెక్ డాంల నిర్మాణానికి 24 కోట్ల రూపాయలను, ఫీడర్ చానళ్ల నిర్మాణానికి సుమారు 20 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న 5 లిఫ్ట్ ఇరిగేషన్లను త్వరలోనే పూర్తి చేస్తామని వెల్లడించారు.
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో 250 కోట్ల రూపాయలతో రోడ్లు మంజూరు చేయడం జరిగిందని, ప్రతి గ్రామం నుండి మండల కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మిస్తున్నామని, నాగార్జునసాగర్ నియోజకవర్గానికి 450 కోట్లు, దేవరకొండ నియోజకవర్గానికి 350 కోట్లతో హ్యాం రోడ్లకు టెండర్లు పిలవనున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 65 వేల కోట్ల రూపాయలతో తెలంగాణ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆర్ అండ్ బి రహదారులు చేపడుతున్నామని తెలిపారు.
రేషన్ కార్డులు ,ఇందిరమ్మ ఇండ్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. హైదరాబాద్- విజయవాడ రహదారని 10,500 కోట్లతో చేపట్టనున్నామని, హైదరాబాద్- చిట్యాల రోడ్డు 7600 కోట్లతో చేపట్టనున్నామన్నారు. నల్గొండ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని తెలిపారు.
స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ 250 కోట్ల రూపాయలతో హ్యాం రోడ్లను మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నీటిపారుదల కింద చేపట్టిన పనులన్ని పురగతిలో ఉన్నాయని ,నియోజకవర్గ అభివృద్ధికి మంత్రులు పూర్తి సహకారం అందించాలని కోరారు.
నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి,ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు మాట్లాడారు.
ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, పబ్లిక్ హెల్త్ ఎస్ ఈ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి తదితరులు మంత్రుల వెంట ఉన్నారు. కాగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెలిప్యాడ్ వద్ద మంత్రులకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమాలలో అదనపు ఎస్పి రమేష్ డీఎస్పీ రాజశేఖర్ రాజు, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కాగా మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున అధ్యక్షులు శ్రీనివాస్ ఆసుపత్రిలో ఫ్రీజర్ బాక్స్ ఏర్పాటు కోసం 25 లక్షల రూపాయల చెక్కును మంత్రులకు అందజేశారు.
MOST READ :
-
UBS అథ్లెటిక్స్ కిడ్స్ కప్ : రెండు లక్షల మందికి పైగా చిన్నారులను కదిలిస్తున్న భారతదేశపు అతిపెద్ద క్రీడా ఉద్యమం..!
-
IBOMMA : ఐ బొమ్మ ప్రేక్షకులకు బిగ్ షాక్.. నిర్వాహకుడి అరెస్ట్..!
-
Miryalaguda : జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం.. మిర్యాలగూడలో సంబరాలు..!
-
TG News : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.50,918 సబ్సిడీ.. మీరు పొందండి..!












