సూర్యాపేట : 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
సూర్యాపేట : 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
సూర్యాపేట , మనసాక్షి
సూర్యాపేట పట్టణం పరిధిలో 2019 సంవత్సరం డిసెంబర్ లో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చివ్వెంల మండలం మున్యానాయక్ తండా గ్రామానికి చెందిన 35 సంవత్సరాల బానోతు శ్రీను ఘాతుకానికి పాల్పడినట్టు గుర్తించి.. సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ నందు పోక్సో చట్టం 2012, నేరం సంఖ్య 205/2019 ప్రకారం నిందితుడి పై కేసు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు అధికారులు అప్పటి పట్టణ సి ఐ శివ శంకర్ విచారణ జరిపి నిందితునిపై నేరాభియోగ పత్రాలను కోర్టుకు దాఖలు చేయడం జరిగినది.
దీనిపై పూర్తి సాక్షాదారాల ప్రకారం సాక్షులను, మరియు బాధితులను విచారించిన 1వ అదనపు సెషన్ జిల్లా కోర్టు న్యాయమూర్తి ప్రేమలత నిందుతుడు బాణోతు శ్రీను నేరానికి పాల్పడినాడు అని నిర్ధారించి నేరస్థునికి 20 సంవత్సరాల జైలు శిక్ష, 10 వేల రూపాయల జరిమానా విధించడం జరిగినది.
అదేవిధంగా భాదితురాలికి (7) లక్షల పరిహారం కూడా ప్రభుత్వం నుండి మంజూరు చేయాలనీ తీర్పు నిచ్చారు. నేరాలకు పాల్పడితే ఏనాటికైనా చట్టపరమైన శిక్షలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
రాష్ట్ర పోలీస్ శాఖలో అమలవుతున్న కోర్టు డ్యూటీ ఫంక్షనల్ వర్టికల్ ఆధారంగా సిబ్బంది సామర్థ్యంతో పనిచేసి అతి తక్కువ కాలంలోనే ఈ కేసును చేదించి నేరస్తునికి శిక్ష పడేలా కృషి చేయడం జరిగింది. అలాగే బాధితురాలికి న్యాయం చేయడం జరిగింది అని అన్నారు.
బాధితురాలిని బరోసా సెంటర్ నందు నైతికంగా, సామాజికంగా, మానసికంగా కౌన్సిలింగ్ నిర్వహించి భరోసా కల్పించడం జరిగింది. అలాగే ప్రభుత్వం నుండి వచ్చిన ఎక్స్గ్రేషియాను అందించడం జరిగిందని అన్నారు.
ఈ కేసులో శిక్ష పడడంలో బాగా పనిచేసిన సూర్యాపేట డిఎస్పి పరికే నాగభూషణం, సూర్యాపేట పట్టణ సిఐ రాజేషేఖర్, కోర్టు పిపి త్యాగరాజు మరియు కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ కృష్ణ, పట్టణ పోలీసు సిబ్బందిని, బరోసా సెంటర్ సిబ్బందిని అభినందించారు.









