Komatireddy Venkatreddy : తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం..!
Komatireddy Venkatreddy : తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం..!
నల్లగొండ, మన సాక్షి :
రాజకీయాల కతీతంగా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించి తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.శనివారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో కోటి రూపాయల ఎం ఎల్ ఏ నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు చదువు పైన దృష్టి సారించి ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని లక్ష్యసాధన కృషి చేయాలని అన్నారు. డిగ్రీ పూర్తయిన తర్వాత స్వంతంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేలా విద్యార్థులకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని, ఇందుకుగాను నల్గొండ జిల్లాలో 20 కోట్ల రూపాయల వ్యయంతో నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్నామని, భవిష్యత్తులో ఈ కేంద్రాన్ని హైదరాబాదులో నిర్మించనున్న స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తామని మంత్రి తెలిపారు.
ఇటీవల ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు.కళాశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థినికి కంప్యూటర్ శిక్షణ ఇవ్వాలని, కళాశా లకు ఎలాంటి వసతులు అవసరమైన సహకారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వ కళాశాలలో మంచి అధ్యాపకులు, అనుభవజ్ఞులు ఉంటారని ప్రైవేట్ కళాశాలలో అనుభవం లేని వారు ఉంటారని ,అందువల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలను ఉపయోగించుకోవాలని కోరారు.
నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కోటి రూపాయల తో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టడమే కాకుండా, అవసరమైన అన్ని వసతులను కల్పిస్తామని, ఒకవేళ అధ్యాపకులు లేకుంటే అధ్యాప కులను నియమించుకున్నట్లయితే ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా జీతాలు చెల్లిస్తామని ఆయన తెలిపారు. డిసెంబర్ లోపు కళాశాలలో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కళాశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్ కావాలని విద్యార్థినిలు కోరగా 2000 మంది విద్యార్థులకు సరిపోయే విధంగా కెంట్ వాటర్ ప్లాంట్ ను వెంటనే ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
ప్రతి ఒక్కరికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని , ఇందులో భాగంగా ప్రభుత్వంఇటీవలే జాబ్ కాలండర్ ను సైతం విడుదల చేసిందని ,నల్గొండ పట్టణం సమీపంలో ఎస్ఎల్బీసీ కాలనీ వద్ద 80 కోట్ల రూపాయల వ్యయంతో బహుళ వసతి గృహ నిర్మాణాన్ని చేపట్టనున్నామని అన్నారు.
ఇక్కడి నుండి చదువుకునే విద్యార్థులకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి అన్ని గ్రామాల నుంచి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని, పేద విద్యార్థులందరూ కష్టపడి చదువుకోవాలని, పట్టుదల, కృషి లక్ష్యం ఏర్పాటు చేసుకొని ముందుకు కదలాలని కోరారు. రాజకీయాలకతీతంగా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను ప్రోత్సహించి తెలంగాణను రోల్ మాడల్గా తీర్చిదిద్దుతామని, గవర్నమెంట్ విద్యపై ఉన్న అపోహను తుడిచివేసే విధంగా కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు,యాజమాన్యం కృషి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు.
కళాశాల ప్రిన్సిపల్ కే. శ్రీనివాసరాజు, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్,పంచాయతీ రాజ్ డి ఈ గిరిధర్ , నల్గొండ ఆర్డీవో రవి ,తహసీల్దార్ శ్రీనివాస్,అధ్యాపక బృందం, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Fack currency : జోరుగా నకిలీ నోట్లు చలామణి.. వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠా..!
ACB : రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఒకేసారి ముగ్గురు దొరికారు..!









