TOP STORIESBreaking News

TG News : కుటుంబ సర్వే.. అడిగే వివరాలు ఇవే.. సిద్ధంగా ఉంచుకోవాల్సిందే..!

TG News : కుటుంబ సర్వే.. అడిగే వివరాలు ఇవే.. సిద్ధంగా ఉంచుకోవాల్సిందే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ సర్వే నిర్వహించనున్నది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఈ సర్వేను చేపట్టనున్నారు. నవంబర్ 4వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఈ సర్వే ను నిర్వహిస్తారు. క్షేత్రస్థాయిలో 15 రోజుల్లో సర్వే పూర్తి చేసి మరో 15 రోజుల్లో ఆన్‌లైన్ లో నమోదు చేస్తారు. అందుకుగాను 90,000 మంది ప్రభుత్వ సిబ్బంది ఈ సర్వేలో పాల్గొననున్నారు.

సర్వేలో రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో సర్వేకు వచ్చిన సిబ్బంది నమోదు చేయాల్సి ఉంటుంది. సర్వే చేస్తున్న ఏరియా వివరాలను, ఇంటి నెంబర్, మండలం, జిల్లా కోడ్, అదే విధంగా వార్డు డివిజన్ వివరాలు కూడా నమోదు చేస్తారు. ఆ నమోదు సమయంలోనే కుటుంబానికి ఒక సీరియల్ నెంబర్ కూడా కేటాయిస్తారు.

వారు వివరాలు నమోదు చేసిన తర్వాత పార్ట్ వన్ లో మరిన్ని వివరాలు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. కుటుంబంలోని సభ్యులు ఎంతమంది, ఇంటి యజమాని ఎవరు..? కుటుంబ సభ్యులకు యజమానికి ఉన్న రిలేషన్..? కులం, మతం, వయస్సు, మాతృభాష వివరాలన్నీ కూడా సర్వేలో అడిగి తెలుసుకుని భర్తీ చేస్తారు.

వీటితోపాటు ఆధార్ కార్డు వివరాలు చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ చెప్పడంలో అభ్యంతరం ఉంటే ఆధార్ కార్డు నెంబర్ చెప్పడం అవసరం లేదు. అదే విధంగా మొబైల్ నెంబర్లు, విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, వృత్తి, ఆస్తుల వివరాలు, బ్యాంకు ఖాతాలు ఉన్న విషయం కూడా చెప్పాలి.

రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించి ఉన్నట్లయితే కులం సర్టిఫికెట్ కూడా చూపించాలి. రాజకీయ నేపథ్యం ఉంటే ఇంట్లో ఎవరికైనా రాజకీయంగా పాల్గొనేవారు ఉన్నారా..? ఉంటే ఏ పార్టీలో ఉన్నారు..? పార్టీలో పదవులు, పార్టీ ద్వారా ప్రభుత్వంలో పొందిన పదవులు, ఏ పార్టీలో సభ్యత్వం ఉంది..? ఎంతకాలం పనిచేస్తున్నారు.. అనే వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంది.

వాటితో పాటు భూములకు సంబంధించిన వివరాలు కూడా భర్తీ చేస్తారు. భూములు ఉంటే ధరణి పాస్ బుక్, ఆ వివరాలు కూడా చెప్పాలి. సాగుభూమి కౌలుకు ఇచ్చారా..? లేక సొంతంగా చేస్తున్నారా..? అని వివరాలు కూడా నమోదు చేస్తారు.

పార్ట్ 2 లో ఐదేళ్లలో తీసుకున్న అప్పులు, ఎందుకోసం అప్పు తీసుకున్నారు. ఎక్కడి నుండి తీసుకున్నారు. అలాంటి వివరాలు కూడా తెలియజేయాల్సింది. కుటుంబానికి ఉన్న స్థిర, చరాస్తి వివరాలు.. ఆవులు, గేదెలు, కోళ్లు, మేకలు, ఇతర సంపదలు ఉన్నది కూడా చెప్పాలి. రేషన్ కార్డు ఉంటే ఆ వివరాలు తెలియజేయాలి. సొంత ఇల్లు ఉంటే ఇంటి విస్తీర్ణం తో పాటు ఎప్పుడు కొన్నారు. ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి. ఇంట్లో ఉన్న సౌకర్యాలు కూడా వివరించాలి.

ఈ వివరాలన్నీ సర్వే అధికారులకు తెలియజేసిన అనంతరం కుటుంబ యజమాని సంతకం చేయాల్సి ఉంటుంది. దాన్నిమరేటర్ పరిశీలించి సర్టిఫై చేస్తారు. తర్వాత సూపర్వైజర్ క్రాస్ చెక్ చేసుకుంటారు. కులగణన లేదా ఫ్యామిలీ సర్వే వివరాలను ఈనెల 4వ తేదీన ప్రారంభించనున్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు