కన్నీళ్లు, మానవత్వం.. పసి పాపకు అమ్మగా మారిన ఖాకీ.. ఏమిటా కథ తెలుసుకోవాలని ఉందా..!
ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష సందర్భంగా భావోద్వేగ భరితమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు ఏళ్ల తరబడి కష్టపడి చదివిన అభ్యర్థులు కేవలం ఒక్క నిమిషం ఆలస్యంతో పరీక్ష రాసే అవకాశం కోల్పోయి కన్నీటి పర్యంతమయ్యారు.

కన్నీళ్లు, మానవత్వం.. పసి పాపకు అమ్మగా మారిన ఖాకీ.. ఏమిటా కథ తెలుసుకోవాలని ఉందా..!
నల్లగొండ, మన సాక్షి :
ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష సందర్భంగా భావోద్వేగ భరితమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు ఏళ్ల తరబడి కష్టపడి చదివిన అభ్యర్థులు కేవలం ఒక్క నిమిషం ఆలస్యంతో పరీక్ష రాసే అవకాశం కోల్పోయి కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు పరీక్ష రాయడానికి వచ్చిన ఓ మహిళకు పసి పాపను చూసుకునే బాధ్యత తీసుకొని ఓ పోలీస్ అధికారి అండగా నిలిచారు. ఈ సంఘటనలు నల్లగొండ జిల్లాలో ఒకే సెంటర్ వద్ద చోటుచేసుకున్నాయి. ఈ కథ ఏంటో తెలుసుకుందాం..
ఎస్ఐ పరీక్ష రాసేందుకు ఓ మహిళ తన చిన్నారితో పరీక్షా కేంద్రానికి చేరుకుంది. అయితే ఆమె వెంట కుటుం బ సభ్యులు ఎవరూ లేకపోవడంతో చిన్నారిని ఎవరికి అప్పగించాలో తెలియక ఆందోళనకు గురైంది. ఆమె పరిస్థితిని గమనించిన డిండి మండలానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ షర్ఫ్ఉద్దీన్ వెంటనే స్పందించారు. చిన్నారిని ఆప్యాయంగా ఎత్తుకొని ఆడిస్తూ, తల్లిని పరీక్ష రాసేందుకు పంపించారు.
తల్లి భవిష్యత్తు కోసం ఓ పోలీస్ చూపిన ఈ చిన్న సాయం.. ఆ కుటుంబానికి ఎంతో పెద్ద భరోసాగా మారింది. ఖాకీ అంటే కేవలం కఠినమైన విధులే కాదు.. అవసరమైన సమయంలో ఆప్యాయతను పంచే హృదయం కూడా ఉంటుందని షర్ఫ్ఉద్దీన్ నిరూపించారు. ఈ మానవీయ చర్యపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఒక్క నిమిషం ఆలస్యం.. ఏళ్ల కష్టం బూడిద
ఇదే పరీక్షా కేంద్రాల వద్ద మరోవైపు తీవ్ర విషాదం కనిపించింది. ఎస్ఐ కావాలనే లక్ష్యంతో ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువతీ యువకులు.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి పరీక్షకు సిద్ధమయ్యారు. కానీ పరీక్షా కేంద్రానికి చేరుకోవడంలో కేవలం ఒక్క నిమిషం ఆలస్యం కావడంతో కొందరు అభ్యర్థులకు పరీక్ష రాసే అవకాశం దక్కలేదు. నిబంధనల ప్రకారం గేట్లు మూసివేయడంతో పరీక్షకు దూరమైన అభ్యర్థులు కన్నీటి పర్యంతమ య్యారు.
అభ్యర్థుల ఎన్నో ఏళ్ల కష్టం, ఒక్క క్షణంలో ఆవేదన
సమయపాలన తప్పనిసరి. పరీక్షల నిర్వహణలో క్రమ శిక్షణ కూడా అవసరమే. కానీ అనుకోని ట్రాఫిక్ సమస్య లు, రవాణా ఇబ్బందులు ఎదురైనప్పుడు అభ్యర్థుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండాలా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యానికి పరీక్ష రాసే అవకాశం కోల్పోవాల్సి రావడం ఎంత వరకు సమంజసం? ఏళ్ల తరబడి చేసిన కష్టం, కుటుంబాల ఆశలు, యువత భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదా?










