District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఉద్యోగుల సర్వీస్ నుంచి తొలగింపు..!
మెడికల్ కాలేజీ సదరం క్యాంపులో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ప్రవీణ, రాజేందర్‌లపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక చర్యలు తీసుకున్నారు.

District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఉద్యోగుల సర్వీస్ నుంచి తొలగింపు..!
BY : RAMAKANTH
నారాయణపేట పట్టణం, మనసాక్షి :
మెడికల్ కాలేజీ సదరం క్యాంపులో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ప్రవీణ, రాజేందర్‌లపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక చర్యలు తీసుకున్నారు. సదరం క్యాంపులో అనరులకు జారీచేసిన సర్టిఫికెట్లపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ విచారణ నిమిత్తం ముఖ్య కార్యనిర్వహణ అధికారి సుజాత ను విచారణ అధికారిగా నియమించారు.
విచారణలో భాగంగా సదరు ఇద్దరు ఉద్యోగులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు, రికార్డుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినట్లు, అనర్హులకు సదరం సర్టిఫికెట్లు మంజూరు చేయడంలో కొంతమంది వైద్యులకు సహకరించినట్లు, ఇందుకు సంబంధించిన రికార్డులను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఈ నేపథ్యంలో వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులైన ప్రవీణ, రాజేందర్‌లను సర్వీసు నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని డి ఆర్ డి ఏ ఎన్. వెంకట రాములును ఆదేశించారు. అదేవిధంగా సదరం క్యాంపు నిర్వహణలో ఎలాంటి అంతరాయం కలగకుండా, వారి స్థానంలో డిఆర్డిఏలో అందుబాటులో ఉన్న ఉద్యోగులకు వెంటనే బాధ్యతలు అప్పగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సదరం సర్టిఫికెట్ల జారీలో నిర్లక్ష్యం లేదా అక్రమాలకు పాల్పడినట్లు తేలిన వైద్యులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.









