Cm Revanth Reddy : బతుకమ్మకు బహుమతి.. చీరలు బంద్..!
Cm Revanth Reddy : బతుకమ్మకు బహుమతి.. చీరలు బంద్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ తొమ్మిది రోజులపాటు బతుకమ్మ ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో జరుగుతాయి. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి ప్రతిరోజు పండగ జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
అందుకుగాను ఏటా 370 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతి ఆడపడుచుకు బతుకమ్మ చీర అందించారు. కాగా బతుకమ్మ చీరలు సూరత్ లో తక్కువకి తీసుకొచ్చి దళారులు ఎక్కువ డబ్బులు కాజేశారని కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
బతుకమ్మ చీరల పంపిణీలో కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. చీరలు నాణ్యతగా లేవని మహిళలు రోడ్డెక్కి ధర్నాలు చేయడంతో పాటు చీరలను కాల్చివేసి నిరసనలు కూడా తెలిపిన విషయం తెలిసిందే. ఇటీవల కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ చీరలపై కామెంట్ చేశారు. సూరత్ లో చీరలు తీసుకొచ్చి చేనేత చీరలు అని చెప్పారని ఆరోపించారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలను బంద్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా బతుకమ్మ చీరలకు బదులు మహిళలకు పండుగ సందర్భంగా ఏదో ఒక గిఫ్ట్ అందించాలని ఆలోచనతో కసరత్తు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాలలో కూడా పండుగల సందర్భంగా మహిళలకు, కుటుంబానికి ఉపయోగపడే విధంగా ఏదో ఒక బహుమతిని ప్రభుత్వాలు అందజేస్తున్నాయి.
అలాంటి రాష్ట్రాలలో తెలంగాణకు సంబంధించిన అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఆంధ్ర ప్రదేశ్ లో అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతికి అక్కడి ప్రజలకు ఉచితంగా చక్కెర, బెల్లం, ఆయిల్, నెయ్యి, కందిపప్పు, శనిగలు పంపిణీ చేస్తారు. అదే తరహాలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి తెలంగాణలో కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా ఏదో ఒక గిఫ్ట్ అందించాలని కసరత్తు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
గిఫ్ట్ ఇవ్వడమా లేక దానికి బదులు కుటుంబంలో మహిళ ఎకౌంట్లోకి 200 రూపాయలు గానీ 250 రూపాయలు గానీ వేయడమా అని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా బతుకమ్మ పండుగ నాటికి చీరలకు బదులు గిఫ్ట్ అందే అవకాశం ఉంది.
ALSO READ :
Krishna Floods : కాసులు కురిపిస్తున్న కృష్ణా నది వరద..!
Viral : హాజరు వేయాలంటే ముద్దు ఇవ్వాలి.. తోటి ఉపాధ్యాయురాలికి ఉపాధ్యాయుడు వీడియో కాల్.. (Video)









