Telangana | తెలంగాణలో గాదె పండగ గురించి విన్నారా..?

Telangana | తెలంగాణలో గాదె పండగ గురించి విన్నారా..?

పినపాక. మన సాక్షి :

పండుగలు అంటేనే ఆచారాలు, కట్టు,బొట్టు, ఐక్యతను చాటి చెప్పేవి. తెలంగాణ లో భిన్న సంస్కృతి సంప్రదాయాలు ఉన్నందున వివిధ రకాల తెగలు అనేక పండుగలు నిర్వహిస్తుంటారు.

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పినపాక మండలం తిర్లాపురం గ్రామంలో అటవీ ప్రాంతంలోని గొత్తికోయ గూడేల్లో గాదె పండుగ ఛత్తీస్‍గఢ్‍ నుంచి వలస వచ్చిన ప్రత్యేక ఆదివాసీ తెగ వారు ఆదివాసి సంప్రదాయంలో నిర్వహించారు.

 

గొత్తికోయలు పంటలు చేతికి వచ్చాక తమ గూడేల్లో గాదె పండుగ నిర్వహిస్తారు. ఈ పండుగను రెండు రోజులు చేసుకోవడం ఆనవాయితీ . గాదె పండగ అయిపోయాక జిగురు, తేనె, తునికాకు, కొండ చీపుళ్ల వంటి అటవీ ఉత్పత్తులు సేకరించేందుకు గొత్తి కోయలు అడవికి వెళ్తారని గొత్తి కోయ పెద్దలు తెలియజేశారు.

 

సంవత్సరంలో ఒక్కసారి ఈ గాదె పండుగ ఆదివాసి సంప్రదాయం పద్దతిలో పండించిన పంటలు, వరి, చిరుధాన్యాలు చేతికి వచ్చిన తరువాత అన్ని కలిపి ఒక బుట్ట లో పోసి గాదె దేవునికి నైవేద్యం పెడుతారు. ఈ కార్యక్రమం పూజారులు, రామయ్య, బీమయ్య, గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఆధ్వర్యంలో నిర్వహించారు.

 

అందరూ కలిసి డోలిలా చప్పులతో మహిళలు సంప్రదాయ, ఆచార పద్ధతితో నృత్యం చేస్తూ పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆధార్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, ఆదివాసి గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.