యాదాద్రి భువనగిరి : అంతరాష్ట్ర గంజాయి స్మగ్లింగ్

అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్లు పట్టివేత

చౌటుప్పల్ .మన సాక్షి.

చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం పోలీస్ స్టేషన్ ఆవరణలో భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర ఏసిపి ఉదయ్ కుమార్ రెడ్డితో కలిసి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ పరిధి భువనగిరి జోన్, చౌటుప్పల్ సబ్ డివిజన్ లో అడ్డగూడూరు పోలీసులు ఒక మహేంద్ర బొలెరో ట్రాలీ ఆటోలో తరలిస్తున్న 232కిలోల గంజాయిని పట్టుకున్నారు. పూర్తి వివరాలు డిసిపి రాజేష్ చంద్ర వెల్లడించారు.

 

మహారాష్ట్ర రాష్ట్రం సోలాపూర్ జిల్లా, బర్షి తాలుకా పంగ్రీ గ్రామానికి చెందిన బజరంగ్ శ్రీరంగ్ కరాడే, సాగర్ శివాజీ మస్తుద్, సుయాస్ రాందాస్ సర్దే, స్నేహితులు. బజరంగ్ కరాడే డ్రైవర్ గా పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందులతో కొద్దిరోజులుగా ఇబ్బందులు పడుతున్నాడు ఆర్థిక అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గంజాయిని తెలంగాణ రాష్ట్రం మీదుగా స్మగ్లింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను అదే విషయాన్ని సాగర్ శివాజీ మస్తుద్ కు తెలియజేశాడు.

 

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి 65వ జాతీయ రహదారి వెంబడి గంజాయి స్మగ్లింగ్ చేసేవారు. ఇటీవల కాలంలో వాహనాల తనిఖీలు అధికం కావడంతో రూటు మార్చారు. జాతీయ రహదారిపై తనిఖీలను తప్పించుకునేందుకు తొర్రూర్, తిరుమలగిరి, అడ్డగూడూర్, భువనగిరి మీదుగా హైదరాబాద్, అటు నుంచి మహారాష్ట్ర చేరవేసేవారు.

 

బజరంగ్ కరాడే, సాగర్ శివాజీ మస్తుద్ ఇద్దరూ భద్రాచలం, చిత్తూరు ప్రాంతానికి వెళ్లి శుక్ర, రాంబాబు నుండి గంజాయిని కొనుగోలు చేసి, మహబూబాబాద్, తొర్రూర్, యాదాద్రి భువనగిరి మీదుగా హైదరాబాద్ నుంచి సోలాపూర్ చేరుకునేవారు. మహేంద్ర బొలెరో ట్రాలీ ఆటో (ఎంహెచ్25 ఏజే3807) లో భద్రాచలం తర్వాత చిత్తూరు వెళ్లి మహేంద్ర బొలెరో ట్రాలీ ఆటో లో ముగ్గురు కలిసి మొత్తం 232కిలోల బరువు గల 114గంజాయి ప్యాకెట్లను ఒరిస్సా రాష్ట్రానికి చెందిన శుక్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాంబాబు నుంచి కొనుగోలు చేశారు.

భద్రాచలం నుంచి సోలాపూర్ బయలుదేరారు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో ఈ నెల 19వ తేదీన రామన్నపేట సీఐ, అడ్డగూడూరు ఎస్ఐలు సిబ్బందితో తొర్రూరు వలిగొండ రోడ్ లోని చౌవుల రామారం శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. చౌళ్ల రామారం గ్రామం వద్ద గోడౌన్స్ సమీపంలోకి చేరుకోగానే చాకచక్యంగా పోలీసులు వారిని పట్టుకున్నారన్నారు.

 

మహేంద్ర బొలెరో ట్రాలీ ఆటో లో గంజాయి తరలిస్తున్న ముగ్గురి నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. ఎన్ డి పి ఎస్ చట్టం ప్రకారం అడ్డగూడూరు తాసీల్దార్ దశరథ సమక్షంలో నిందితులను హాజరపరిచి వారి నుంచి సుమారు 232కిలోల బరువున్న 114గంజాయి పొట్లాలను, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

 

స్మగ్లర్ల నుండి 232 కిలోల గంజాయి, బొలోరో వాహనం, నాలుగు చరవాణీలు స్వాధీనం చేసుకోగా వాటి విలువ సుమారు రూ.42లక్షల15వేలు ఉంటుందని తెలిపారు. గంజాయి దిమాక్ చేసుకునే ఒరిస్సా కు సంబంధించిన వ్యక్తి కోసం ఒక టీం వెళ్లిందన్నారు. త్వరలోనే ఆ వ్యక్తిని పట్టుకుంటామన్నారు.

 

చట్ట ప్రకారం 2కిలోల గంజాయి సరఫరా చేసినా 10 సంవత్సరాల జైలు జీవితం నిందితులు అనుభవించాల్సి వస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 5కేసులు పట్టుకున్నామన్నారు. గత నాలుగు కేసుల్లో కూడా గంజాయి సరఫరా ముఠా మొత్తం పట్టుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. గంజాయి సరఫరా చేసిన వారిపై పిడి యాక్ట్ చేస్తున్నామన్నారు.

 

రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు భువనగిరి డిసిపి రాజేష్ చంద్ర, చౌటుప్పల్ ఏసిపి ఉదయ్ కుమార్ రెడ్డి, రామన్నపేట సిఐ మోతీరాం అడ్డగూడూర్ ఎస్సై ఉదయ్ కిరణ్, వారి సిబ్బంది శ్రీకాంత్ రెడ్డి చౌటుప్పల్ ఎస్సై అనిల్ వారి సిబ్బందితో కలిసి నిందితులను పట్టుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

 

రాచకొండ పోలీస్ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహన్ సిబ్బందిని అభినందించారు. ఈ సమావేశంలో చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ కి చెందిన ఎస్ ఐ సీత పాండు, ఎస్సై ప్రభాకర్, ఎస్సై అనిల్, ఎస్సై వెంకన్న, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.