TG News : రైతులకు అదిరిపోయే శుభవార్త.. మరో కొత్త పథకం ప్రారంభం..!
TG News : రైతులకు అదిరిపోయే శుభవార్త.. మరో కొత్త పథకం ప్రారంభం..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఉపయోగపడే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. రైతు రుణమాఫీ తో పాటు పంటలకు బోనస్ కల్పించి రైతులను ఆదుకుంటుంది. అదేవిధంగా రైతు భరోసా పథకం కూడా సంక్రాంతి వరకు ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు.
ఇదిలా ఉండగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని మళ్లీ పున ప్రారంభించనున్నది. గత ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని యాసంగి సీజన్ నుంచి ప్రారంభించేందుకు సిద్ధమైంది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు ఉపయోగపడే వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందజేయనున్నారు. ఈ పథకం వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరే అవకాశం ఉంది.
గత ప్రభుత్వంలో ఈ పథకాన్ని నీరుగార్చడంతో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ పథకం ప్రారంభించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 26 కోట్ల రూపాయల కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 20 కోట్ల రూపాయలను జమ చేసింది. మొత్తంగా 46 కోట్ల రూపాయలతో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (ఆగ్రోస్) ద్వారా గతంలో ఈ పథకం సక్రమంగా అమలు కాలేదని వ్యవసాయ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దాంతో ఆగ్రోస్ ప్రమేయం లేకుండానే వ్యవసాయ యాంత్రికరణ పథకాన్ని అమలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్ణయించారు.
వ్యవసాయ పరికరాలు, యంత్రాలతో జిల్లాల వారీగా ప్రదర్శనలు నిర్వహిస్తారు. ప్రదర్శనలో పాల్గొన్న రైతులకు వ్యవసాయ పరికరాల ఉపయోగం, వాటి నాణ్యత, ధరలు వివరాలను సైంటిస్టులు వివరించనున్నారు. ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులను తీసుకొని అర్హులైన వారిని గుర్తించి వారికి సబ్సిడీపై పరికరాలను అందజేయనున్నారు.
వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో పవర్ టిల్లర్లు, ఎంబి నాగళ్ళు, హార్వెస్టర్లు, తైవాన్ స్ప్రేయర్లు, గడ్డి కట్టలు కట్టే బేలార్ యంత్రాలు, రోటోవేటర్లు, పత్తి తీసే యంత్రాలు, మామిడి కాయలను తెంపే పరికరాలు, గడ్డి కత్తిరించే యంత్రాలు, పసుపు ఉడికించే పరికరాలు, మొక్కజొన్నలను వొలిచే యంత్రాలను పంపిణీ చేస్తారు. ట్రాక్టర్లకు భారీగా డిమాండ్ ఉన్నందున ట్రాక్టర్లను అందజేయవద్దని నిర్ణయించారు. వ్యవసాయ యాంత్రీకరణ పద్ధతి ద్వారా సబ్సిడీపై కొనుగోలు చేసిన యంత్రాలతో రైతులు తమ సొంత వ్యవసాయ పనులతో పాటు అద్దెకు ఇచ్చి ఆదాయం కూడా పొందే అవకాశం ఉంది.
MOST READ :
-
Miryalaguda : పీడీఎస్ బియ్యం, గంజాయి అక్రమ రవాణా పై నిరంతరం నిఘ పెట్టాలి.. ఐజి సత్య నారాయణ ఆదేశం..!
-
Hyderabad : మద్యం మత్తులో వాహనం డ్రైవింగ్.. ఎల్బీనగర్ కోర్టు సంచలన తీర్పు..!
-
District collector : స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. జిల్లా కలెక్టర్..!
-
District collector : ఇందిరమ్మ ఇళ్ల ధరఖాస్తుదారులకు సమస్యలుంటే.. వారి కోసం టోల్ ఫ్రీ నెంబర్.. జిల్లా కలెక్టర్ వెల్లడి.!









