Breaking Newsతెలంగాణరాజకీయం

TG News : రైతు పండుగలో రైతులకు మొండి చెయ్యి.. సీఎం రేవంత్ కు హరీష్ కౌంటర్..!

TG News : రైతు పండుగలో రైతులకు మొండి చెయ్యి.. సీఎం రేవంత్ కు హరీష్ కౌంటర్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

రైతు పండుగలో రైతులకు మొండి చేయి చూపారని మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

మహబూబ్ నగర్ రైతు పండుగలో రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎంత మొత్తుకున్నా దండుగే అయ్యింది. ఆడంబరంగా నిర్వహించిన కార్యక్రమం యావత్ తెలంగాణ రైతాంగాన్ని ఉసూరు మనిపించింది. ఏడాది పూర్తయిన సందర్భంగానైనా రైతులందరికీ రుణమాఫీ, వానాకాలంతో పాటు ఈ యాసంగికి ఇచ్చే రైతు భరోసా మొత్తం కలుపుకొని ఎకరాకు 15వేలు ప్రకటిస్తారనుకుంటే మరోసారి మొండి చెయ్యి చూపారు.

ఇక కౌలు రైతులు, ఉపాధి కూలీలకు రైతు బంధుకు అతీగతీ లేదు. రైతు పండుగ పేరుతో రైతులను మాయమాటలతో మరోసారి మోసం చేసారు. కేసీఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని కూడా కాంగ్రెస్ పేటెంటే అంటూ గప్పాలు కొట్టుకోవడం సిగ్గుచేటు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కాదు, మా కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్లనే కోటి 53 లక్షల టన్నుల వరి పండిందని గొప్పలు చెప్పుకోవడం నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఉంది.

మీరు చెప్పిన ప్రాజెక్టులు 2014లో కూడా ఉన్నాయి. మరి అప్పుడు 68 లక్షల టన్నుల వరి మాత్రమే ఎందుకు పండింది రేవంత్ రెడ్డి? 2023-24 నాటికి కోటి 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి ఎలా సాధ్యం అయ్యింది? 2014-15 లో లక్షా 31 వేల ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం 2023 నాటికి 2లక్షల 21 వేల ఎకరాలకు ఎలా పెరిగింది? చెప్పేవాడికి ఇంగితం లేకున్నా వినేవాడికైనా వివేకం ఉంటది కదా!
సమైక్య రాష్ట్రంలో కూడా మీరు చెప్పిన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం చూస్తే రైతుల పట్ల ప్రేమ కంటే, గిరిజనుల నుంచి భూసేకరణ చేయడంలో ఘోరంగా విఫలమయ్యామనే ఆవేదనే కనిపించింది. అభివృద్ధి జరగాలంటే రైతులు నష్టపోవాలని చెబుతున్నవు. పాలమూరు సభ సాక్షిగా ఏ రైతులను బెదిరిస్తున్నావు. పాలమూరు బిడ్డగా ఇది నీకు న్యాయమా? రేవంత్ రెడ్డి.

ఒకసారి ఫార్మాసిటీ అని గజిట్ ఇచ్చి, బీఆర్ఎస్ పోరాటంతో వెనక్కి తగ్గి ఇప్పుడు పారిశ్రామిక కారిడార్ అని ప్రచారం చేస్తున్నావు. ఎటు వాటమైతే అటు మాట్లాడటం నీకే చెల్లింది. మాకొద్దు ఫార్మాసిటీ అంటూ లగచర్లలో లడాయి చేసిన గిరిజన బిడ్డలను అరెస్టులు చేసి జైలుకు పంపించావు.

ఇప్పుడేమో సొంత జిల్లా ప్రజల మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు మొసలి కన్నీరు కార్చుతున్నావు. రుణమాఫీ చేస్తానని నూటొక్క దేవుళ్ల మీద ఒట్టేసి మాట తప్పావు. ఇప్పుడు నీ మంత్రుల సాక్షిగా ఒట్టు వేసి పాలమూరు అభివృద్ధికి మాటిచ్చావు.

రుణమాఫీ లెక్కనే పాలమూరు అభివృద్ధి హామీ ఉంటదేమో. పాలమూరుకు ఏం చేసావని కేసీఆర్ గారిని ప్రశ్నించే హక్కు మీకెక్కడిది. కాంగ్రెస్ పాలనలో వలసలకు, ఆకలి చావులకు నిలయంగా మారిన పాలమూరు తలరాతను మార్చింది కేసీఆర్, వలసలను వాపస్ తెచ్చింది కేసీఆర్.

మీ పాలనలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది కేసీఆర్ కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల్లో 2014 వరకు కేవలం 27వేల ఎకరాలు సాగైతే, దాన్ని ఆరున్నర లక్షల ఎకరాలకు పెంచింది కేసీఆర్.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించి 90శాతం పూర్తి చేస్తే, ఏడాది పాలనలో మీరు మిగిలిన చివరి పనులు కూడా పూర్తి చెయ్యక చోద్యం చూస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదైతే అది కూడా మీ ఖాతాలో వేసుకున్నావు.

ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తివి పచ్చి అబద్దాలు మాట్లాడటానికి నోరెలా వచ్చింది రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారికి గజ్వెల్ లో వెయ్యి ఎకరాల ఫాం హౌజ్ ఉన్నట్లు అబద్ధాలు మాట్లాడం కాదు. నిరూపించేందుకు సిద్దమా? రేవంత్ రెడ్డి

నిరూపించకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తవా?

ఇప్పటికే నీకు కాంగ్రెస్ తత్వం బోధపడినట్లుంది. మల్లా అవకాశం వస్తదా? వస్తదా? అని భయపడుతున్నవు. అసెంబ్లీకి రమ్మని తెగ పిలుస్తున్నావు రేవంత్ రెడ్డి. మేము ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నం మీ ఏడాది పాలనలో అన్ని వర్గాలను ఏడిపించడమే తప్ప ప్రజలకు చేసిందేం లేదు. అబద్దాలు చెబుతూ ఏడాది నడిపించావు. ఈ అబద్దాలతో ఇంకా ఎంతో కాలం మోసం చేయలేవు. అసెంబ్లీలో నీ ఏడాది పాలన అసలు రంగు బయట పెట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీలో మైకులు కట్ చేయకుండా సమయం కేటాయించే దమ్ము మీకుందా?

MOST READ : 

మరిన్ని వార్తలు