సెంచరీతో చెలరేగిన పంత్.. IND vs ENG తొలి రోజు ఆట ముగిసింది.
సెంచరీతో చెలరేగిన పంత్.. IND vs ENG తొలి రోజు ఆట ముగిసింది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. ఆధిక్యం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది.వర్షం కారణంగా తొలిరోజు ఆట ఆలస్యంగా ప్రారంభం అయింది. మొదట ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి ముందు టీమిండియా టాపార్డర్ పెవిలియన్ క్యూ కట్టగా.
ఆ తర్వాత రిషభ్ పంత్ (146) వచ్చి బ్రిటిష్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. జడేజా కూడా రాణించడంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత జట్టు 73 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. జడేజా (83), షమీ (0) క్రీజులో ఉన్నారు. గిల్ (17), పుజారా (13), విహారి (20), కోహ్లీ (11), శ్రేయస్ (15) పూర్తిగా నిరాశపర్చారు.
2007 తర్వాత ఇంగ్లండ్‌లో తొలి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తున్న భారత జట్టు ప్రస్తుత సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉండగా దాదాపు 10 నెలల తర్వాత సిరీస్‌లోని చివరి మ్యాచ్‌కు రంగంలోకి దిగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ పిచ్ పరిస్థితులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. జేమ్స్ అండర్సన్, మాథ్యూ పాట్స్ టీమిండియా టాపార్డర్‌ను నేలకూల్చారు. వీరిద్దరి ధాటికి కేవలం 98 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది భారత జట్టు. అక్కడ నుండి పంత్, జడేజా షో ప్రారంభమైంది. రెండో సెషన్ ముగిసే సమయానికి పంత్ కేవలం 51 బంతుల్లోనే తన అర్ధసెంచరీని పూర్తి చేసుకోగా, జడేజా కూడా ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. వీరిద్దరూ రెండో సెషన్‌లో భారత్‌ను 174 పరుగులకు చేర్చారు. ఇక మూడో సెషన్‌లో పంత్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. కేవలం 89 బంతుల్లో మూడంకెల స్కోరును చేరుకున్నాడు. టెస్టుల్లో భారత వికెట్ కీపర్ చేసిన వేగవంతమైన సెంచరీ ఇదే.
జడేజా-పంత్‌ల అద్భుత భాగస్వామ్యం..
పంత్ సెంచరీ చేసిన వెంటనే, జడేజా కూడా తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు . ఇద్దరూ కలిసి జట్టు స్కోరును 250కి తీసుకెళ్లారు. సెంచరీ తర్వాత మరింత చెలరేగాడు. సిక్స్‌లు, ఫోర్లతో మైదానాన్ని హోరెత్తించాడు.
కేవలం 111 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 146 పరుగులు చేసిన రిషభ్ రూట్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అతను జడేజాతో కలిసి ఆరో వికెట్‌కు కేవలం 230 బంతుల్లోనే 222 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ (52/3), మాథ్యూ ప్యాట్స్ (85/2) సత్తాచాటారు.
వర్షం అంతరాయం కలిగించడంతో మొదటి రోజు ఆట ఆలస్యంగా ప్రారంభం అయింది కేవలం 77 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.











