Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల యాక్షన్ ప్లాన్.. జిల్లా కలెక్టర్ సమావేశం..!
Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల యాక్షన్ ప్లాన్.. జిల్లా కలెక్టర్ సమావేశం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జిల్లాలో పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హత కలిగిన వారినే ఎంపిక చేయాలన్నారు.
గురువారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల యాక్షన్ ప్లాన్ పై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని, గత జనవరి 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారని, అలాగే ఫిబ్రవరి 21న నారాయణపేట మండలంలోని అప్పక్ పల్లి గ్రామంలో ఓ లబ్ధిదారు రాలికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ చేశారని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మండలంలో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ఈ పథకాన్ని అమలు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వారికి బుధవారం సాయంత్రం వరకు మొదటి విడత రూ. లక్ష వారి ఖాతాలో జమ అవుతుందనే సమాచారం వచ్చిందని కలెక్టర్ తెలిపారు. అలాగే నియోజకవర్గానికి ప్రభుత్వం కేటాయించిన 3500 ఇండ్ల కోసం అర్హత కలిగిన వారినే ఎంపిక చేయాలని, జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో చిన్న పొరపాటు కూడా జరగడానికి వీలులేదని ఆమె తేల్చి చెప్పారు.
దరఖాస్తు చేసుకున్న వారి వద్దకు వెళ్లి ప్రస్తుతం వాళ్ళు ఉంటున్న ఇంటిని, పై కప్పు ను పరిశీలించిన తర్వాతే ప్రభుత్వ నిబంధనల మేరకు ఎంపిక చేయాలని ఆమె ఆదేశించారు. హైదరాబాద్, లేదా వేరే ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారిని ఎంపిక చేయ వద్దన్నారు. ఎలిజిబుల్ విత్ ల్యాండ్ ప్రకారమే ఎంపిక ఉండాలన్నారు.
ఇందిరమ్మ కమిటీల ద్వారా ఈ నెల 21 వరకు దరఖాస్తుల జాబితా ఎంపీడీవోలకు చేరుతుందని, ఈ నెల 30 వరకు ఇచ్చిన కోటా కు క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఎంపిక చేయాలని ఆమె సూచించారు. మే 2న గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అర్హుల జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. అధికారులు ఎవరో ఫోన్ చేశారని, అనర్హులను పథకానికి ఎంపిక చేసినా గ్రామస్తుల నుంచి అభ్యంతరాలు వస్తాయని, ఈ విషయం దృష్టిలో పెట్టుకొని అర్హుల ఎంపిక పగడ్బందీగా, పారదర్శకంగా చేయాలని కలెక్టర్ సూచించారు.
అలాగే ఈ నడి వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ హౌసింగ్ పీడీ శంకర్, అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు ఎంపీవో లు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్ డబ్ల్యూఎస్, ఇరిగేషన్, హౌసింగ్ ఏ ఈ లు పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : భూభారతి చట్టంపై 17 నుంచి విజ్ఞాపనలు స్వీకరణ.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!
-
Miryalaguda : రైతుపై దాడి చేసిన రైస్ మిల్లర్లు.. ఆసుపత్రిలో రైతును పరామర్శించిన ఎమ్మెల్యే..!
-
Gold Price : రెండోరోజు వరుసగా మళ్ళీ తగ్గిన గోల్డ్.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Gold Loan : 30 నిమిషాల్లో గోల్డ్ లోన్.. రంగంలోకి ఆ సంస్థ..!









