Kanagal : శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు షురూ..!
భక్తుల కొంగు బంగారంగా విరాజుల్లుతున్న ధర్వేశిపురం (పర్వతగిరి) శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి షురూ కానున్నాయి.

Kanagal : శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు షురూ..!
– నేటి నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
– రేపు శ్రీ రేణుక ఎల్లమ్మ – జమదగ్ని మహామునిల కళ్యాణం
– ఎల్లుండి వైభవంగా అమ్మవారికి బోనాలు
కనగల్, మన సాక్షి :
భక్తుల కొంగు బంగారంగా విరాజుల్లుతున్న ధర్వేశిపురం (పర్వతగిరి) శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి షురూ కానున్నాయి. తేదీ 23 నుండి 25 వరకు మూడు రోజులపాటు అమ్మవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు అమ్మవారి ఆలయాన్ని రంగులు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారి కళ్యాణమండపం వద్ద భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.
అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా (తేదీ 23 మొదటి రోజు) మంగళవారం సుప్రభాత సేవతో మంగళ వాయిద్యాల నడుమ సహస్రనామార్చన బాలభోగ నివేదన, ధ్వజారోహణ, మూలమంత్ర హోమములు, మండల పూజలు, నీరాజనం, మంత్ర పుష్పములు, గవ్యాంత పూజలు, నిత్యహోమములు, బలిహరణ, అంకురార్పణ, ధ్వజారోహణ, పుట్ట బంగారం, అగ్ని ప్రతిష్టాపన తదితర పూజలను వేద పండితుల మంత్రోచ్ఛారణలతో వైభవంగా నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల రెండవ రోజు (తేదీ 24) బుధవారం శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ – జమదగ్ని మహామునిల లోక కళ్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. అమ్మవారి కళ్యాణాన్ని చూసేందుకు భక్తులు అన్ని ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి రానున్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తదితర ప్రముఖులు హాజరుకానున్నట్లు ఆలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, ఈవో అంబటి నాగిరెడ్డిలు తెలిపారు.
బ్రహ్మోత్సవాల చివరి రోజు (తేదీ 25) గురువారం అమ్మవారికి ధర్వేశిపురం, పర్వతగిరి గ్రామస్తులచే వైభవంగా బోనాలు సమర్పించనున్నారు. బోనాల ఘట్టానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు. ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎండోమెంట్, ఆలయ పాలకమండలి అన్ని ఏర్పాట్లు చేశారు.









