సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు.. ఎల్ నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ ప్రణాళికలు..!
ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో చోటు చేసుకుంటున్న మార్పులు, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రస్తుత పంటలను కాపాడేందుకు వ్యవసాయ, విద్యుత్, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.

సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు.. ఎల్ నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ ప్రణాళికలు..!
పంటల రక్షణకు రానున్న 15–20 రోజులు కీలకం..
నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి:
(పుల్ కల్, మన సాక్షి – పోచయ్య)
ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో చోటు చేసుకుంటున్న మార్పులు, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రస్తుత పంటలను కాపాడేందుకు వ్యవసాయ, విద్యుత్, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.
ఎల్నినో ప్రభావంతో నీటి లభ్యత, వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు గురువారం సీఎస్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా సింగూరు జలాశయంలో నీటి నిల్వలను పరిశీలించారు.
అనంతరం పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ట్రాన్స్కో సీఎండీ జితేష్ వి. పాటిల్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, నీటిపారుదల, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై సమీక్షించారు.
Also Read : ప్రియుడిని బెయిల్ పై విడిపించేందుకు డ్రగ్ సరఫరా చేస్తూ దొరికిన ప్రియురాలు..!
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సింగూరు జలాశయంలో నీటిమట్టం, జిల్లాలో తాగునీటి లభ్యత, వర్షపాతం, పంటల సాగు పరిస్థితులు, తాగునీటి సరఫరాకు రూపొందించిన ప్రత్యామ్నాయ ప్రణాళికల గురించి సీఎస్కు వివరించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని సూచించారు. గ్రామాల వారీగా తాగునీటి అవసరాలను గుర్తించి, అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో కార్యాచరణ ప్రణాళికలను పటిష్టంగా అమలు చేయాలన్నారు.
అగ్రిమెంటేషన్ అవసరమైన పనులన్నింటినీ నవంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో అవసరమైనప్పుడు నీటి రవాణా ఏర్పాట్లు చేయడంతో పాటు అవసరమైన బోర్వెల్లను హైరింగ్ చేసుకోవడానికి చర్యలు చేపట్టాలని సూచించారు.
రానున్న 15–20 రోజులు పంటల రక్షణకు అత్యంత కీలకమైనందున వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితులను పరిశీలించి రైతులకు అవసరమైన సూచనలు అందించాలని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లపై అధిక విద్యుత్ భారం పడకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలన్నారు. నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆరుతడి, స్వల్పకాలిక ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
పశుగ్రాసం కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వీబీజీ రామ్ జీ పథకం కింద నీటి సంరక్షణ పనులు, నీటి నిల్వ కుంటల నిర్మాణం వంటి పనులను గుర్తించి చేపట్టాలని, అవసరమైన పనుల జాబితాను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
అనంతరం చౌటకూర్ గ్రామంలో కౌలు రైతు గొల్ల మహేష్ ఏడు ఎకరాల్లో సాగు చేస్తున్న పత్తి పంటను సీఎస్ పరిశీలించారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పత్తి దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రైతు వివరించారు. వర్షపాతం లోటు, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగు చేయగల స్వల్పకాలిక కూరగాయ పంటలను సాగు చేయాలని సీఎస్ సూచించారు.
Also Read : Breaking News : మన సాక్షి బ్రేకింగ్ న్యూస్ 15-10-2026
ట్రాన్స్కో సీఎండీ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలమట్టాలు తగ్గి విద్యుత్ మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్నారు. రైతులు తక్కువ నీటితో సాగు చేయగల ఆకుకూరలు, కూరగాయలను పండించడంతో పాటు కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం వంటి అనుబంధ రంగాల ద్వారా అదనపు ఆదాయం పొందేలా సంబంధిత శాఖల అధికారులు తగిన సలహాలు, సూచనలు అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, నీటిపారుదల, ఆర్డబ్ల్యూఎస్, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.










