Mavoist letters : మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు, ఇద్దరి అరెస్టు

మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు, ఇద్దరి అరెస్టు

జగిత్యాల ప్రతినిధి,(మన సాక్షి)

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని అనేక గ్రామాల సర్పంచులకు, ఎంపీటీసీ ప్రభుత్వ అధికారులకు ఇతర ప్రజా ప్రతినిధులకు గత రెండు రోజులుగా మావోయిస్ట్ ల పేరుమీద హెచ్చరికల లేఖలు వస్తున్నాయి.

 

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇట్టి లేఖల వెనుక ఉన్న మర్మాన్ని ఛేదించడానికి జగిత్యాల జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ ఆదేశాలతో జగిత్యాల రూరల్ సిఐ ఆరిఫ్ అలీ ఖాన్ నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నమ్మదగ్గ సమాచారంతో సాంకేతిక పరిజ్ఞానముతో తో సోమవారం తెల్లవారు జామున ఇద్దరిని అరెస్టు చేశారు.

 

పోలీసులు అరెస్టు చేసిన వారిలో భోగ లక్ష్మీరాజం తండ్రి లచ్చన్న(54)నర్సింహులపల్లి ,పోలు ప్రకాష్ (54)సిరిసిల్ల,ఈ వ్యక్తులను ఆధీనంలోకి తీసుకొని పోలీసులు విచారించగా.. ఈ నిందితులు బీర్పూర్ మండలం నరసింహులపల్లి గ్రామానికి చెందిన మాజీ మిలిటెంట్ భోగ లక్ష్మీరాజం కు అదే గ్రామానికి చెందిన పోస్టుమాస్టర్, కిరాణం షాప్ నడుపుతున్న బోగ సత్తన్నలకు 60 గజాల ఖాళీ స్థలము విషయంలో గత కొంతకాలంగా వివాదము నడుస్తుంది.

 

సదరు లక్ష్మీరాజం భోగ సత్తన్నకు సహకరిస్తున్నారని అనుమానంతో గ్రామ సర్పంచ్ ప్రభాకర్, కార్యదర్శి రాజ్ కుమార్ లను భయభ్రాంతులకు గురి చేసే ఉద్దేశంతో తన స్నేహితుడైన సిరిసిల్ల పట్టణంలో ప్లెక్స్ ప్రింటింగ్ షాపు నడుపుతున్న పోలు ప్రకాష్ వద్ద నుంచి మావోయిస్టు పేరుతో హిందీ తెలుగు భాషలలో కొన్ని లెటర్ హెడ్స్ తయారు చేయించాడు. వాటిపై మావోయిస్టులు రాసినట్టుగా హెచ్చరిక లేఖలు రాసి పోస్టు ద్వారా పంపటం జరిగినది.

 

ఈ విచారణలో సదరు లక్ష్మీరాజం భూవివాదంలో తన ప్రత్యర్థులైన సత్తన్నకు మాత్రమే లేఖలు పంపితే అనుమానిస్తారనే ఉద్దేశంతో బీర్పూర్ మండలంలోని అనేకమంది సర్పంచులకు ఎంపీటీసీలకు ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఇట్టి ఉత్తరాలను పోస్ట్ ద్వారా పంపటం జరిగినది.

 

ఇట్టి లేఖలు పూర్తిగా లక్ష్మీ రాజం తన వ్యక్తిగత విషయంలో ప్రత్యర్ధులను భయపెట్టడానికి తయారు చేసినవి మాత్రమే అని విచారణలో తేలినది. నిందుతులవద్ద నుంచి ఒక కంప్యూటర్ మానిటర్ ,సిపియు, కలర్ ప్రింటర్ ,లేఖలు వ్రాయడానికి ఉపయోగించిన పేపర్లు ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

 

ఇట్టి కేసును త్వరితగతిన ఛేదించిన జగిత్యాల రూరల్ సీఐ ఆరిఫ్ అలీ ఖాన్,బీర్ పూర్ ఎస్సై అజయ్ , సారంగపూర్ ఎస్సై మనోహర్ రావు, కానిస్టేబుల్ రవి, జలంధర్ సుమన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎగ్గిడి భాస్కర్ అభినందించారు.