Youth: అప్పు చేసి పప్పు కూడు కు స్వస్తి.. వ్యక్తిగత రుణాలపై ఆసక్తి తగ్గుదల..!

Youth: అప్పు చేసి పప్పు కూడు కు స్వస్తి.. వ్యక్తిగత రుణాలపై ఆసక్తి తగ్గుదల..!
ముంబై, మన సాక్షి :
“అప్పు చేసి పప్పు కూడు తినొద్దు” అనే సామెతను భారత యువతరం ఇప్పుడు నిజంగానే ఆచరిస్తోంది. గతంలో మాదిరిగా అనవసర ఖర్చులకు విచ్చలవిడిగా రుణాలు తీసుకోవడం, అవసరం ఉన్నా లేకున్నా వస్తువులు కొనడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తమ వద్ద ఉన్న డబ్బును పొదుపు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
తప్పనిసరి అయితేనే, అది కూడా స్థిరాస్తులు లేదా చరాస్తులు సమకూర్చుకోవడానికి మాత్రమే అప్పు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. జేబులో రెండు మూడు క్రెడిట్ కార్డులున్నా, ‘పొదుపు’ మంత్రాన్ని పాటిస్తున్నారు.
ఈ పరిణామాల ఫలితంగా, 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 12 శాతంగా ఉన్న రిటైల్ రుణాల వృద్ధిరేటు, 2024-25 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఏకంగా ఐదు శాతానికి పడిపోయింది అని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ ఒక నివేదికలో వెల్లడించింది.
కన్స్యూమర్ డ్యూరబుల్ రుణాలు, క్రెడిట్ కార్డు రుణాల తగ్గుదల దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా పట్టణ, మెట్రో నగరాల్లో నివసిస్తున్న 35 ఏళ్ల లోపు యువత అప్పులు తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడడం లేదు.
ఎగవేతల భయం ఎక్కువగా ఉండే హామీలేని రుణాలపై 2023 చివరిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విధించిన ఆంక్షలు కూడా ఈ ధోరణికి కారణమని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తెలిపింది.
నివేదికలోని ఇతర ప్రధానాంశాలు:
ట్రాన్స్‌యూనియన్ సిబిల్ నివేదిక ప్రకారం, రుణ వృద్ధిరేట్లలో వచ్చిన మార్పులు కింద ఉన్నాయి:
క్రెడిట్ కార్డు రుణాల వృద్ధిరేటు: జీరో నుండి మైనస్ 32 శాతానికి పడిపోయింది.
వ్యక్తిగత రుణాల వృద్ధి: 13 శాతం నుండి ఆరు శాతానికి తగ్గింది.
కన్స్యూమర్ డ్యూరబుల్స్ రుణాల వృద్ధిరేటు: 19 శాతం నుండి ఆరు శాతానికి తగ్గింది. క్రెడిట్ యాక్టివ్ వినియోగదారులు: 15 శాతం నుండి ఎనిమిది శాతానికి తగ్గారు.
కొత్తగా రుణాలు తీసుకునే వారి వృద్ధిరేటు: 19 శాతం నుండి 16 శాతానికి తగ్గింది.
గృహ రుణాల వృద్ధిరేటు: ఐదు శాతం నుండి మైనస్ ఏడు శాతానికి పడిపోయింది.
రూ. కోటిపైగా రుణాలు: తొమ్మిది శాతం పెరిగాయి. ఇది సంపన్నులు, పెద్ద వ్యాపారాలు రుణాలు తీసుకోవడంలో పెరుగుదలను సూచిస్తుంది.
గ్రామీణ రుణాలు: 20 శాతం నుండి 22 శాతానికి పెరిగాయి. సెమీ అర్బన్ ప్రాంత రుణాల వృద్ధి: 29 శాతం నుండి 30 శాతానికి పెరిగింది. ఈ గణాంకాలు భారతదేశంలో వినియోగదారుల రుణ ప్రవర్తనలో ఒక స్పష్టమైన మార్పును సూచిస్తున్నాయి. యువతలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతున్నదని, అలాగే గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రుణ అవసరాలు పెరుగుతున్నాయని ఈ నివేదిక తెలియజేస్తుంది.
MOST READ :
-
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..!
-
Transfers : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు..!
-
District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. అంబ భవాని ఎత్తిపోతల నిర్మాణ పనుల పరిశీలన..!
-
Miryalaguda : మిర్యాలగూడలో ఘరానా మోసం.. లక్కీ డ్రా పేరుతో రూ.3.90 కోట్లు స్వాహా.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు..!
-
Miryalaguda : రూ.3 కోట్లతో చిట్టీల వ్యాపారి రాత్రికి రాత్రే పరార్.. లబోదిబోమంటున్న బాధితులు..!









