నారాయణపేట : నకిలీ విత్తనాలు అమ్మితే పిడి యాక్ట్

నకిలీ విత్తనాలు అమ్మితే పిడి యాక్ట్

నారాయణపేట:  జిల్లా కేంద్రంలో స్థానిక జిల్లా ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు ఆదేశం మేరకు జిల్లా కేంద్రంతో పాటు మరికల్ , కోస్గి మండల కేంద్రాల పోలీసులు, వ్యవసాయ అధికారులు సీడ్స్ షాప్స్, ఎరువుల దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.

 

ఈ దుకాణాల్లో ఏమైనా నకిలీ విత్తనాలు ఉన్నాయని ఆరా తీశారు. అలాగే సరైన ధ్రువపత్రాలు కలిగి ఉన్నారా లేదా అని విత్తన ప్యాకెట్ ల ను, ఎరువుల , బిల్ బుక్స్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ…

 

రైతులు వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తుంటారు వారికి నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు అమ్మి మోసం చేస్తే షాపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు. నకిలీ విత్తనాలు అమ్మి పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. రైతులకు విత్తనాలు అమ్మే సమయంలో ప్రతి ఒక్కరూ రిసిప్ట్ ఇవ్వాలని సూచించారు.

 

అలాగే రైతులు కూడా విత్తనాలు ఎరువులు కొనేముందు తప్పకుండా రసీదు తీసుకోవాలని పంట పండేంతవరకు రసీదులను జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపారు. రైతులు విత్తనాలు కొనేముందు వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు తీసుకొని విత్తనాలు కొనాలని తెలిపారు.

 

మండలంలో ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వారి సమాచారం పోలీసులకు ఇవ్వాలని వారి వివరాలను గోప్యంగా ఉంచి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. ఈ తనిఖీలలో వ్యవసాయ అధికారి అనిల్ , పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.