రోడ్డు ప్రమాదంలో ఉప సర్పంచి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఉప సర్పంచి దుర్మరణం

కంగ్టి సెప్టెంబర్ 20 మన సాక్షి : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ సోమవారు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉప సర్పంచి దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం… కంగ్టి మండలం రాంతీర్ధ్ పంచాయతీ ఉప సర్పంచి బిరాదర్‌ జ్ఞానేశ్వర్‌(27) సోమవారం రాత్రి 9 గంటలకు ఖేడ్‌ జంట గ్రామమైన మంగల్‌పేట వైపునకు ద్విచక్రవాహనంపై వస్తున్నాడు.

ఆక్సీజన్‌ పార్కు ఎదురుగా నిజాంపేట ఖేడ్‌ బీదర్‌ జాతీయ రహదారి పక్కన ఇటీవల భగీరధ పైపులైను లీకవ్వ డంతో మరమ్మతులకు గోతి తవ్వి పూడ్చకుండా వదిలేశారు. ఈ గోతి వద్ద సూచికలు లేకపోవడం, మరోవైపు వర్షం కురుస్తుండటంతో జ్ఞానేశ్వర్‌ ద్విచక్ర వాహనంతో సహా అందులో పడి రోడ్డుపై పడిపోయాడు.

ఇదే సమయంలో అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు చక్రాలు జ్ఞానేశ్వర్‌ తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఎస్సై వెంకట్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఖేడ్‌ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.