మిర్యాలగూడ : తప్పుడు మెడికల్ రిపోర్టులతో వైద్యుడి మాయాజాలం

మిర్యాలగూడ : తప్పుడు మెడికల్ రిపోర్టులతో వైద్యుడి మాయాజాలం

మిర్యాలగూడ, మనసాక్షి

తప్పుడు మెడికల్ రిపోర్టులిస్తూ… డాక్టర్లు మాయాజాలం చేస్తున్నారు. ఎలాంటి జబ్బులు లేకున్నా తప్పుడు నివేదికలతో భయాందోళనలకు గురిచేసి సొమ్ము దోచుకుంటున్నారు. ఇలాంటి సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలోని స్టార్ పిల్లల ఆసుపత్రిలో మాయాజాలం చోటుచేసుకుందని తప్పుడు నివేదికలతో తమను ఆందోళనకు గురి చేశాడంటూ బాధితులు ఆందోళనకు దిగారు.

 

వివరాల ప్రకారం…. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం సపావత్ తండాకు చెందిన సపవత్ పాండు రెండేళ్ల కుమారుడు మధు కార్తీక్ కు జ్వరం రావడంతో డాక్టర్స్ కాలనీలోని స్టార్ పిల్లల ఆసుపత్రికి గత నెల 29వ తేదీన తీసుకువచ్చాడు. బాలుడి ని పరీక్షించిన వైద్యుడు రక్త పరీక్షలు నిర్వహించాలని ల్యాబ్ కు రిఫర్ చేశాడు.

రక్త నమూనాలు సేకరించిన పారా మెడికల్ సిబ్బంది బాలుడుకి డెంగ్యూ, మలేరియా లక్షణాలతో పాటు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారించి రిపోర్టు ఇచ్చారు. కాగా బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతుందని సదరు వైద్యుడు చెప్పడంతో భయాందోళనలకు గురైన బాలుడి తల్లిదండ్రులు హైదరాబాద్ కు తీసుకెళ్లారు.

 

కాగా హైదరాబాదులో పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి లక్షణాలు లేవని సాధారణ స్థాయిలోనే జ్వరం ఉన్నట్లు చెప్పడంతో ఆగ్రహించిన బాలుడి బంధువులు, తల్లిదండ్రులు స్టార్ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. పరీక్షల పేరుతో తమ వద్ద 12 వేల రూపాయలు వసూలు చేసిన వైద్యుడు అనవసరంగా తమ బాలుడికి తప్పుడు నివేదికలు ఇచ్చి తమని ఆందోళనకు గురి చేశాడంటూ బాధితులు పేర్కొన్నారు.