TG News : రాష్ట్రంలో రూ.60 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి..!

TG News : రాష్ట్రంలో రూ.60 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి..!
ఏఎమ్మార్పీ కాలువల లైనింగ్ కు రూ.450 కోట్ల
గ్రామపంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి.
ఏకగ్రీవ గ్రామపంచాయతీలుకు రూ. 30 లక్షలు.
రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి.
రూ.50 కోట్లతో చేపట్టనున్న రోడ్డు పనులకు శంకు స్థాపన
నల్లగొండ, మన సాక్షి :
తెలంగాణ రాష్ట్రంలో 60 వేల కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో పట్టణంలోని నాగార్జునసాగర్ ఎక్స్ రోడ్ నుండి దర్వేశిపురం ఎల్లమ్మ దేవాలయం వరకు మహబూబ్నగర్- నల్గొండ రహదారిని నాలుగు లైన్ల రహదారి నిర్మాణం, సెంట్రల్ మీడియన్, సెంట్రల్ లైటింగ్ తో సహా నిర్మించేందుకు ఉద్దేశించి 50 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ వారం రోజుల్లో సాగర్ ఎక్స్ రోడ్ నుండి దర్వేషిపురం వరకు నిర్మించే నాలుగు లైన్ల రహదారి పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ధర్వేశిపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని దర్వేషిపురం వద్ద ఇదివరకే 12 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డుతో పాటు , సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ మీడియన్ కట్టించామని తెలిపారు.
అలాగే కొత్తపల్లి ముషంపల్లి రహదారుల తోపాటు, జిల్లాలో అన్ని రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, అన్ని గ్రామాలకు రోడ్లతో పాటు, మురుగు కాలువలను నిర్మిస్తున్నామని చెప్పారు. ఏఎంఆర్పి కాలువల లైనింగ్ కు 450 కోట్ల రూపాయలు మంజూరు చేయించామని తెలిపారు.
నల్గొండ పట్టణంలో ప్రధాన రహదారుల అభివృద్ధిలో భాగంగా సెంట్రల్ మీడియన్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామని, బైపాస్ రహదారి చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహిళలే బస్సులను నిర్వహించుకునేలా బస్సులు ఏర్పాటు చేసామని పేర్కొన్నారు. 5 లక్షల రూపాయలతో ఒక్కొక్కరికి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామని, రైతు భరోసా, సన్న బియ్యం, సన్న ధాన్యం పండించిన రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామని తెలిపారు.
రాబోయే మూడేళ్లలో ఇల్లు లేని పేదవారు ఉండకుండా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు. ప్రతి గ్రామంలో రేషన్ షాపు ఉండేలా చూసామని అన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో 18 కొత్త రేషన్ షాపులు ఏర్పాటు చేశామన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. వచ్చే మూడేళ్లలో గ్రామాల రూపురేఖలను మారుస్తామని తెలిపారు.
నల్గొండ పట్టణంలో దశలవారీగా ఇల్లు లేని వారందరికీ ఇండ్లు కట్టిస్తామన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇవ్వడం జరిగిందని, నల్గొండ నియోజకవర్గంలో కనగల్, తిప్పర్తి, నల్గొండ మండలాలలో మహిళల చేత రైస్ మిల్లుల నిర్వహణకు రైస్ మిల్లు కట్టించి ఇస్తామని, తద్వారా వారికి వచ్చే లాభాన్ని మహిళా సంఘాలు పంచుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో నిర్మించిన బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను డిసెంబర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. నీటిపారుదల అభివృద్ధిలో భాగంగా సొంత నిధులు వెచ్చించి ఏ ఎం ఆర్ పి కాలువల లైనింగ్, కంపచెట్లను తొలగించడం, బ్రాహ్మణవెల్లెముల ద్వారా చెరువులను నింపడం వంటివి చేసామని ఆయన వెల్లడించారు.
గత పదేండ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పేదల అభివృద్ధికి చేసింది ఏమీ లేదని మంత్రి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇక టిఆర్ఎస్ పార్టీకి చోటు లేదని, ఇప్పటికే ఆ పార్టీ మూడు ముక్కలైందని ఎద్దేవా చేశారు.
కెసిఆర్ కుటుంబమంతా దోచుకోవడం, దాచుకోవడమేనని వ్యాఖ్యానించారు.
బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అవినీతి అక్రమాలను కెసిఆర్ కూతురు కవితే బయటపెడుతుందని స్పష్టం చేశారు. పదేళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుందని స్పష్టం చేశారు.బిజెపికి ఇక్కడ ఛాన్స్ లేదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, ఆలకుంట నాగరత్నం రాజు,ధర్వేశిపురం దేవాలయ కమిటీ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, కనగల్ మండల పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుప రెడ్డి,మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్,
దేవి రెడ్డి వెంకట్ రెడ్డి, భారత వెంకటేశం, మాజీ కౌన్సిలర్లు, స్థానిక కాంగ్రెస్ నాయకులు సమద్, ఇబ్రహీం, జానయ్య, పగిడి విగ్నేశ్వర్, పాలడుగు అజయ్, భగవంతు రెడ్డి,నక్క వినయ్, రొమ్ముల నాగయ్య,ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : పంచాయతీ ఎన్నికలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. పారదర్శకంగా నిర్వహించాలి..!
-
Phone Calls : ట్రూ కాలర్ అవసరం లేదు.. మీకు వచ్చే కాల్స్ కు ఆధార్ లో ఉండే పేరు డిస్ ప్లే అవుతుంది..!
-
TG News : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు వేళాయే.. రైతుల ఖాతాలలో ఎప్పుడంటే..!










