Nalgonda : ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.. అమరుల త్యాగాల ఫలమే నేటి తెలంగాణ..!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 13వసంవత్సరంలో అడుగుపెడుతున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని నల్లగొండలో నీ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Nalgonda : ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.. అమరుల త్యాగాల ఫలమే నేటి తెలంగాణ..!
ధాన్యం కొనుగోలు లో జిల్లా ముందు వరుసలో ఉంది.
నల్లగొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది –
రాష్ట్ర అవతరణ దినోత్సవంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
నల్లగొండ, మనసాక్షి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 13వసంవత్సరంలో అడుగుపెడుతున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని నల్లగొండలో నీ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, జిల్లా ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎందరో అమరవీరుల త్యాగఫలితంగా 4 కోట్ల ప్రజల 60 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ
నల్లగొండ జిల్లా విప్లవాల పురిటిగడ్డ అని, సాయుధ పోరాటం నుండి మలిదశ ఉద్యమం వరకు ఈ గడ్డ సింహభాగం పాత్ర పోషించిందని కొనియాడారు. నాడు ప్రజల ఆకాంక్ష కోసం తన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా విసిరికొట్టి, ఆమరణ నిరాహార దీక్షకు దిగిన చరిత్ర తనదని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి పథంలో దూసుకుపోతోందని, నల్లగొండ జిల్లాను అభివృద్ధి, సంక్షేమంలో అగ్రభాగాన నిలబెట్టే బాధ్యత తనదని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు జరుగుతున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికా” కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సాధించిన వివిధ శాఖల ప్రగతి వివరాలను మంత్రి వెల్లడించారు.
మహాలక్ష్మి పథకం: జిల్లాలో మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటివరకు 10 కోట్ల 83 లక్షల ఉచిత ప్రయాణాల ద్వారా రూ.508.85 కోట్ల లబ్ధి చేకూరింది. రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకం కింద 2,52,963 మంది లబ్ధిదారులకు రూ.44.12 కోట్ల సబ్సిడీ అందించడం జరిగిందని తెలిపారు.
ధాన్య సేకరణలో ప్రథమ స్థానం:
యాసంగి (2025-26) సీజన్ లో క్వింటాకు రూ. 2,389 మద్దతు ధర చెల్లించి, 459 కేంద్రాల ద్వారా 7,24,033 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి నల్లగొండ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంచిన జిల్లా కలెక్టర్ ను మంత్రి అభినందించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే 78,650 మంది రైతుల ఖాతాల్లో రూ.1223.88 కోట్లు జమ చేశారు.
రైతు సంక్షేమం:
రైతు భరోసా కింద వానాకాలం, యాసంగి సీజన్లలో కలిపి వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయబడ్డాయని అలాగే జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద 2,33,981 మంది రైతులకు రూ.2004.83 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయని తెలిపారు. గృహజ్యోతి పథకం:జిల్లాలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే 2,51,117 మంది వినియోగదారులకు జీరో బిల్లులు జారీ చేయడం జరిగింది. దీనికోసం ప్రభుత్వం రూ.184.40 కోట్ల సబ్సిడీ భరించిందని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు:
మొదటి విడతలో జిల్లాకు 18,837 ఇండ్లు మంజూరు కాగా, పురోగతిలో ఉన్న గృహాలకు ఇప్పటివరకు రూ.275 కోట్లు లబ్ధిదారులకు చెల్లించారని 2,067 గృహాలు పూర్తి కాగా, రెండవ విడతలో ప్రతి నియోజకవర్గానికి మరో 2,000 ఇండ్లు ఇవ్వనున్నాట్లు ప్రకటించారు.
సాగునీటి రంగం (ఇరిగేషన్):
నాగార్జునసాగర్ ఎడమ కాలువ లైనింగ్ పనులకు రూ.54 కోట్లు, ఏం ఆర్ ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టు పనులకు రూ.444 కోట్లు (హై-లెవల్), రూ.52 కోట్లు (లో-లెవల్) మంజూరు చేసి పనులు పురోగతిలో ఉన్నాయని డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ హెడ్ రీచ్ పనులకు రూ.1800 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.
రహదారులు మరియు భవనాల శాఖ
హైబ్రిడ్ యాన్యుటి మోడల్ హమ్ కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.13 వేల కోట్లతో పనులు జరుగుతుండగా, జిల్లాలో ఫేజ్-1 కింద 532.05 కి.మీ రహదారుల వెడల్పు పనులకు రూ.1457.66 కోట్లు మంజూరయ్యాయని ప్లాన్ నిధుల కింద రూ.949.95 కోట్లు, నల్లగొండ పట్టణంలో ఘాట్ రోడ్డు నిర్మాణానికి రూ.140 కోట్లు మంజూరై పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు.
విద్య & నైపుణ్యాభివృద్ధి:
20 కోట్లతో నల్లగొండ ఐటిఐ ప్రాంగణంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించటం జరిగిందని,ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం చేపడుతున్నామని, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది నుండి బి.ఫార్మసీ, లా కాలేజీ తరగతులు ఈ ఏడాదిప్రారంభమవుతున్నాయని తెలిపారు.
వైద్యారోగ్యం:
రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం వల్ల జిల్లాలో 11,388 మంది లబ్ధి పొందారని,ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఉన్నతీకరణకు రూ.32.85 కోట్లు మంజూరయ్యాయని, రూ.40 కోట్లతో నూతన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు.యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్:4 యూనిట్ల నిర్మాణం పూర్తయి వాణిజ్య విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందని రోజుకు సుమారు 76.8 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని మిగిలిన ఒక యూనిట్ పనులు 2026 జూలై నాటికి పూర్తవుతాయని తెలిపారు.
శాంతి భద్రతలు:
నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, మాదకద్రవ్యాల నిర్మూలనకు గట్టి చర్యలు తీసుకుంటోందని అన్నారు.జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కి , ఎస్పీ శరత్ చంద్ర పవార్ కి, జిల్లా అధికార యంత్రాంగానికి, బ్యాంకు అధికారులకు మరియు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీడియా మిత్రులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ అస్తిత్వాన్ని తెలియజేసేలా విద్యార్థులతో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.తదుపరి వివిధ శాఖలచే ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనలను మంత్రి తిలకించారు.విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ చూపెట్టిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను మంత్రి అందజేశారు. తెలంగాణ రాష్ట్ర అమరుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు.
అనంతరం చండూరు మండలం ఉడతలపల్లి గ్రామానికి చెందిన కొరివి శ్రీదేవి-శివ దంపతులకు ఇందిరమ్మ ఇంటి గృహపత్రాన్ని మంత్రి ఈసందర్భంగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మెప్మా ద్వారా లబ్ధిదారులకు 6 కోట్ల 46 లక్షల 50 వేల రూపాయల చెక్కును అందజేశారు.
అంతేకాక స్త్రీ నిధి రుణాలను స్వయం సహాయక మహిళా సంఘాలకు అందించారు.
పర్యావరణంలో వేసవి శిబిరం నిర్వహణలో ఉత్తమంగా నిలిచిన జడ్పిహెచ్ఎస్ కట్టంగూరు, టీజీ ఎంఎస్ నిడమనూరు, టీజీ ఎంఎస్ మిర్యాలగూడ విద్యార్థులను జ్ఞాపికలు బహుకరించారు .చండూరు మండలం , ఉడతలపల్లి చెందిన కొరివి శ్రీదేవికి ఇందిరమ్మ ఇంటి పట్టాను అందజేశారు డిఆర్డిఏ, గృహ నిర్మాణ , వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమం, రవాణా, అగ్నిమాపక శాఖ ద్వారా శకటాలను రూపొందించి ప్రదర్శించారు. వివిధ శాఖల ద్వారా స్టాళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. బాల భవన్ నాగార్జునసాగర్ విద్యార్థుల నృత్య ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది .ఈ సందర్భంగా మంత్రి పోలీస్ సేవ పథకాలను అందజేశారు .
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శంకర్ నాయక్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్, అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, ఆర్డీవో వై అశోక్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, స్థానిక కార్పొరేటర్ కవిత, జిల్లా అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, సిబ్బంది, తదితరులు ,హాజరయ్యరు.













