Karimnagar : కళాసాంజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎం.ఈ.ఓ ఆకస్మిక తనిఖీ..!
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం పోచంపల్లిలోని కళాసాంజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలను విక్రయిస్తున్నట్లు పి.డి.ఎస్.యు నాయకులు గుర్తించారు.

Karimnagar : కళాసాంజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎం.ఈ.ఓ ఆకస్మిక తనిఖీ..!
పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నారని, పాఠశాల అనుమతి రద్దు చేయాలని పి.డి.ఎస్.యు డిమాండ్..
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం పోచంపల్లిలోని కళాసాంజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలను విక్రయిస్తున్నట్లు పి.డి.ఎస్.యు నాయకులు గుర్తించారు. స్కూల్ యాజమాన్యం తమ సొంత పేరుతో పుస్తకాలను ముద్రించి, విద్యార్థులకు అధిక ధరలకు అమ్ముతున్నారనే నమ్మదగిన సమాచారంతో విద్యార్థి సంఘ నాయకులు పాఠశాలకు చేరుకున్నారు.
ఈ విషయమై వారు వెంటనే స్థానిక మండల విద్యాధికారికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఎం.ఈ.ఓ రాపెల్లి శ్రీనివాస్ హుటాహుటిన పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థి సంఘ నాయకులతో కలిసి ఆయన తరగతి గదులను, పాఠశాల ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో విద్యార్థుల వద్ద ‘కళాసాంజ్ ఇంటర్నేషనల్ స్కూల్’ పేరుతో ముద్రించి ఉన్న నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పాఠశాల పర్మిషన్ రద్దు చేయాలి: పి.డి.ఎస్.యు డిమాండ్
ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు తెలంగాణ కోశాధికారి అంగిడి కుమార్ మీడియాతో మాట్లాడారు. నిబంధనలను తుంగలో తొక్కి, తల్లిదండ్రుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తూ వ్యాపారానికి తెరలేపిన కళాసాంజ్ స్కూల్‌పై జిల్లా విద్యాధికారి డిఇఓ పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని, ఈ పాఠశాల అనుమతిని రద్దు చేయాలని ఆయన కోరారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం: ఎం.ఈ.ఓ వివరణ
ఈ విచారణపై మానకొండూర్ ఎం.ఈ.ఓ రాపెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పి.డి.ఎస్.యు నాయకుల ఫిర్యాదు మేరకు తాము పాఠశాలలో తనిఖీలు నిర్వహించామని, విద్యార్థుల వద్ద స్కూల్ పేరుతో ఉన్న పుస్తకాలను గుర్తించడం నిజమేనని స్పష్టం చేశారు. ఈ అక్రమ విక్రయాల వ్యవహారాన్ని తమ పై అధికారి అయిన డిఇఓ దృష్టికి తీసుకెళ్లి, సమగ్ర విచారణ అనంతరం తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ తనిఖీ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా కార్యదర్శి లోకిని మల్లేష్, జిల్లా ఉపాధ్యక్షులు వెల్డి రాజు మరియు ఇతర విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు.










