హన్వాడను కరువు మండలంగా ప్రకటించాలి..!

హన్వాడను కరువు మండలంగా ప్రకటించాలి..!
హన్వాడ, మన సాక్షి:
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలో వర్షాబావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, తక్షణమే హన్వాడను కరువు మండలం గా ప్రకటించి బాధితులకు ఎకరాకు 30 వేల రూపాయలు పరిహారం చెల్లించాలని బిఆర్ఎస్ డిమాండ్ చేశారు.
హన్వాడ మండలంలోని టంకర, బుద్ధారం, గుడ్డిమల్కాపురం గ్రామాల్లో బుధవారం మండల నాయకులు పర్యటించి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు లేక విత్తనాలు మొలకెత్తక, కొన్ని చోట్ల వేసిన పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని వారు అన్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా చేపట్టి, రైతులకు తగిన ఆర్థిక సాయం అందించాలని కోరారు.
ప్రభుత్వం స్పందించి వెంటనే హన్వాడ రైతాంగాని ఆదుకోకపోతే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ కృష్ణయ్య గౌడ్, మాజీ జెడ్పిటిసి నరేందర్, చెన్నయ్య, జంబులయ్య, రాజు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.









