Breaking : సూర్యాపేట జిల్లాలో విషాదం.. ఆర్‌ఎంపీ వైద్యం వికటించి ఎనిమిదో తరగతి విద్యార్థిని మృతి..!
గుర్రంపోడు తండా ప్రైవేట్ ఆర్‌ఎంపీ వైద్యుడు అందించిన వైద్యం వికటించడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందిన విషాద ఘటన మండలంలోని గుర్రంపోడు తండాలో బుధవారం చోటుచేసుకుంది.

గుర్రంపోడు తండాలో విషాదం.. చికిత్సపై కుటుంబ సభ్యుల అనుమానాలు
గరిడేపల్లి (మఠంపల్లి) : గుర్రంపోడు తండా ప్రైవేట్ ఆర్‌ఎంపీ వైద్యుడు అందించిన వైద్యం వికటించడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందిన విషాద ఘటన మండలంలోని గుర్రంపోడు తండాలో బుధవారం చోటుచేసుకుంది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంపోడు తండాకు చెందిన రామావత్ శంకర్ నాయక్, కుమారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో రెండో కుమార్తె రామావత్ ప్రమీల (13) నకిరేకల్ సమీపంలోని ఐటీపాముల గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ప్రమీల విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం తల్లి కుమారి పాఠశాలకు వెళ్లి కుమార్తెను ఇంటికి తీసుకువచ్చింది.
అయినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో బుధవారం ఉదయం ప్రమీలను పెదవీడు గ్రామంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్న ఓ ప్రైవేట్ ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యుడు రక్త నమూనా సేకరించి ఇంజక్షన్ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం తీవ్ర నీరసానికి గురైన ప్రమీల అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
దీంతో ఆర్‌ఎంపీ వైద్యుడు తన సొంత కారులో ప్రమీలను హుజూర్‌నగర్‌లోని అభయ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో కోదాడకు తీసుకెళ్లాలని సూచించారు. అయితే కోదాడకు తరలిస్తుండగా చిలుకూరు సమీపంలో ప్రమీల మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా, ఆర్‌ఎంపీ వైద్యుడు చికిత్స కేంద్రం నుంచి ప్రమీలను తన సొంత కారులో మరో వ్యక్తి సహాయంతో తీసుకెళ్లడం, తల్లిని అక్కడే వదిలివచ్చినట్లు కుటుంబ సభ్యులు పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అయితే వైద్యం వికటించిందా? విద్యార్థిని మృతికి అసలు కారణాలేమిటన్నది వైద్యపరమైన విచారణలో తేలాల్సి ఉంది.
అధికారులు విచారణ చేపట్టాలని,
ప్రభుత్వ అనుమతులు, నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌ఎంపీ పేరుతో చికిత్స కేంద్రాలు నిర్వహిస్తున్న వారిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మండల ప్రజలు కోరుతున్నారు. విద్యార్థిని మృతికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అభం శుభం తెలియని బాలిక మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.









