సూర్యాపేట : బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. అసమ్మతినేతల రాజీనామా

సూర్యాపేట : బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. అసమ్మతినేతల రాజీనామా

త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న నేతలు

సూర్యాపేట , మనసాక్షి

కార్యకర్తకు నాయకుడు నుండి గుర్తింపు లేని దగ్గర ఉండలేమని కార్యకర్తను పట్టించుకోని ఏ నాయకుడు సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించలేడని సూర్యాపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పెదిరెడ్డి రాజా అన్నారు.

 

బుధవారం జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శనగని రాంబాబు గౌడ్ మాజీ మండల పార్టీ టిఆర్ఎస్ అధ్యక్షులు మోదుగు నాగిరెడ్డి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు భాష పంగు భాస్కర్ సూర్యాపేట జిల్లా టిఆర్ఎస్ నాయకులు నేరెళ్ల మధు గౌడ్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత లేదని కనీసం మంత్రి కార్యకర్తను గుర్తించే పనిలో లేడని వారు అన్నారు. టిఆర్ఎస్ పార్టీలో చేరిన నాటి నుండి తమకు తగిన ప్రాధాన్యత లేదని క్యాంప్ ఆఫీసుకు తాను ఎందుకు రావడం లేదని కనీసం ఒక్క రోజైనా తనకు మంత్రి నుండి ఫోన్ కాల్ రాలేదని పెద్దిరెడ్డి రాజా వాపోయారు .

 

మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్ స్థానాలు కనీసం చైర్మన్ ను ఎన్నుకోలేని స్థితిలో గెలిచారని ఇండిపెండెంట్ ల కొనుగోలుతో సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ చేజిక్కించుకుందని ఆయన అన్నారు.

 

ఆ తర్వాత ప్రకటించిన మండల కమిటీలను గాని సూర్యాపేట పట్టణ కమిటీలలో గాని ప్రాధాన్యత క్రమం లేకుండా ఒక సీనియర్ నాయకుడైన తను కూడా సంప్రదించకుండా ఒంటెద్దు పోకడతో కమిటీలు వేశారని తన నమ్ముకున్న అనుయాయులకు మొండి చేయి చూపారని ఆవేదన వ్యక్తంచేశారు.

 

తాను 35 సంవత్సరాల పైగా టిడిపిలో కొనసాగానని 19 సంవత్సరాల వయసులో సూర్యాపేట నియోజకవర్గంలో టిడిపి జెండా పట్టుకుని ఒకటే పార్టీలో అన్ని సంవత్సరాలు పనిచేశానని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను నేరుగా పేరు పెట్టి పిలిచే స్థాయికి ఎదిగినందుకు సంతోషించానని తెలంగాణలో టిడిపి బ్రతికి బట్ట కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు తాను మంత్రి జగదీశ్ రెడ్డి నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీలో చేరానని గుర్తు చేశారు .

 

తాను టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు సూర్యాపేట జిల్లా టిడిపి అధ్యక్షుడిగా ఉన్నట్లు ఆయన తెలిపారు ఆ రోజు నుండి ఈరోజు వరకు ఏ ఒక్క రోజైనా మంత్రి పిలిపించుకొని సలహాలు గానీ సూచనలు గాని స్వీకరించలేదని ఈ విషయము తనకు ఎంతో బాధించిందని అన్నారు . పార్టీలో చేరినంత మాత్రాన ఎదురెళ్లి నమస్కారం పెట్టి ఉత్తి చేతులతో కూర్చోవాల్సిందే నా అని వాపోయారు .

 

తాను ఏ పార్టీలో ఉన్న ఏ పని అప్పగించిన కష్టపడి పనిచేసి సక్సెస్ సాధించేవరకు విశ్రమించనని అలాంటిది తనకు టిఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత తగ్గిందని అన్నారు.

 

కాంగ్రెస్ లో త్వరలో చేరుతాము : 

బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశం ఉద్దేశం తాము త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు పెద్దిరెడ్డి రాజా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ లో తమకు రేవంత్ రెడ్డి బాస్ అని ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయనున్నట్లు తెలిపారు.

 

సూర్యాపేట నియోజకవర్గంలో ఎవరికి టికెట్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో నియోజకవర్గ వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రజా ప్రతినిధుల చేరిక ఉంటుందని వార్డు స్థాయి మెంబర్ల నుంచి సర్పంచ్ వార్డు కౌన్సిలర్లు వివిధ హోదాలో ఉన్న వారందరూ తమతో పాటు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని ఆయన తెలిపారు.

 

మంత్రిపై విమర్శలు లేని సమావేశం : 

 

పార్టీని వీడి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్లే ఎవరైనా కానీ గతంలో ఉన్న పార్టీని ఆ పార్టీ నాయకుని విమర్శించి పార్టీని వెలివేయడం సహజం కానీ బుధవారం నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ అసమతి నేతల విలేకరుల సమావేశంలో పెద్దిరెడ్డి రాజా శనగాని రాంబాబు గౌడ్ , నేరెళ్ల మధు గౌడ్ అంత మంత్రి మీద వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను విమర్శలు చేయలేదు .

 

కార్యకర్తలను నాయకుడు పట్టించుకోవాలని మునుముందు ఆ పని మంత్రి జగదీశ్ రెడ్డి చేస్తే లీడర్లను క్యాడర్ను కాపాడుకోవచ్చు అని సూచన చేశారు.

 

ఈ విలేకరుల సమావేశంలో పెద్దిరెడ్డి కళ్యాణ్, సాజిద్ ఖాన్ మాజీ కౌన్సిలర్ కొండగడుపుల సూరయ్య , మాజీ సర్పంచ్ దున్న బాబు గోపగాని గిరి గౌడ్, రాపర్తి వెంకటేశం, రాపర్తి సురేష్ గౌడ్ , రాచకొండ దేవయ్య, ధరావత్ దసురు, ఎలుగూరి రవి, ఎలుగూరి వెంకన్న , గుణగంటి మధు , కొండా రాజేష్, సలిగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు