Kanagal : శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న నల్లగొండ జిల్లా, కనగల్ మండలంలోని దర్వేశిపురం (పర్వతగిరి) శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Kanagal : శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
కనగల్, మనసాక్షి:
భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న నల్లగొండ జిల్లా, కనగల్ మండలంలోని దర్వేశిపురం (పర్వతగిరి) శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం దేవాలయం వద్ద నిర్వహించిన ఆలయ నూతన పాలకమండలి ధర్మకర్తలు, చైర్మన్ ప్రమాణ స్వీకారానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేవాలయ అభివృద్ధికి అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద కళ్యాణ మండపము, వాటర్ ట్యాంకు కట్టించడం జరిగిందని, రూ. 50 కోట్ల కేంద్ర రహదారుల నిధులతో నల్గొండ నుండి ధర్వేశిపురం వరకు రహదారిని నిర్మించనున్నామని, టెండర్ పూర్తయిందని రేపటినుండి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే ధర్వేశిపురం ప్రాంతంలో ఒక పెద్ద ఇండస్ట్రీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.
ఫోర్ లేన్ రోడ్డు అభివృద్ధికి రూ. 239 కోట్లతో ధర్వేశిపురం మీదుగా గుర్రంపోడు- కొండమల్లేపల్లి- దేవరకొండ- డిండి వరకు హ్యాం రోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ధర్వేశిపురంను మోడల్ గా తీర్చిదిద్దడంలో భాగంగా త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని ధర్వేశిపురానికి తీసుకురానట్లు తెలిపారు. ఎక్కడైనా రహదారులు బాగుంటేనే అన్ని సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలో రూ. 1300 కోట్లతో 480 రోడ్లను డబుల్ రోడ్లు చేసేందుకు టెండర్లు పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు. కనగల్ మండలంలో ఇండ్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు.
నల్గొండ జిల్లా అభివృద్ధిలో భాగంగా ఏఎమ్మార్పీ కాలువల లైనింగ్ చేపట్టడం జరిగిందని ,రానున్న 2 ఏళ్లలో ఎస్ఎల్ బిసీ సోరంగం పూర్తయితే రెండు పంటలు పండుతాయని చెప్పారు.
నల్గొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా 900 కోట్ల రూపాయలతో పట్టణం చుట్టూ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నామని, నల్గొండ పట్టణంలో తాగునీటి ట్యాంకులతో పాటు, విద్యాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగానే బొట్టు గూడా ప్రభుత్వ పాఠశాలను అత్యంత అద్భుతంగా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలకు రోడ్లు, సిసి రోడ్లతో పాటు, డ్రైన్లు ఇవ్వనుందని ఇవన్నీ పూర్తయితే గ్రామాల రూపు రేఖలు మారుతాయని మంత్రి తెలిపారు.
శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన సిహెచ్. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ధర్వేశిపురం ఎల్లమ్మ అమ్మవారి దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి ఆధ్వర్యంలో రూ. 10 కోట్లు కేటాయించడం జరిగిందని, ఇదివరకే ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని, మిగతా 5 కోట్లతో పనులు చేపడతామని ,రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవాలయాన్ని పూర్తిగా పునర్నిర్మించడం జరుగుతుందని, ధర్వేశిపురం లో అంగన్వాడీ కేంద్రాన్ని ,అలాగే పాఠశాలకు వెళ్లే రహదారిని మంజూరు చేయాలని మంత్రితో విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు, దేవాదాయశాఖ అధికారులు మంత్రికి పూర్ణకుంభం, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి ,డిఎస్పి శివరాం రెడ్డి, ఎండోమెంట్ అధికారులు, కనగల్ తహసిల్దార్ పద్మ, రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఈవో అంబటి నాగిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










