జేఈఈ అడ్వాన్స్డ్ 2026లో అలెన్ హైదరాబాద్ అద్భుత విజయం
ఐఐటీ రూర్కీ విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలలో అలెన్ హైదరాబాద్ విద్యార్థులు అసాధారణ ప్రతిభ చాటారు

ఐఐటీ రూర్కీ విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలలో అలెన్ హైదరాబాద్ విద్యార్థులు అసాధారణ ప్రతిభ చాటారు. ఈ ప్రతిష్టాత్మక ఫలితాలలో ఇక్కడి విద్యార్థి రుషి ప్రేమ్‌నాథ్ జాతీయ స్థాయిలో 177వ ర్యాంకు సాధించగా, సామవేదం రఘు కపిష్ అక్షిత్ 192వ ర్యాంకు కైవసం చేసుకుని దేశంలోనే టాప్ 200 ర్యాంకర్ల జాబితాలో నిలిచారు. వీరు మాత్రమే కాకుండా అలెన్ హైదరాబాద్ సెంటర్ నుండి మొత్తం ఏడుగురు విద్యార్థులు టాప్ 1000 లోపల అత్యుత్తమ ర్యాంకులు సాధించి సంస్థ కీర్తిని పెంచారు.
ఈ అద్భుత విజయాలతో అలెన్ హైదరాబాద్ కోచింగ్ సెంటర్ లో పండుగ వాతావరణం సంతరించుకుంది. విజేతలుగా నిలిచిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఫ్యాకల్టీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించి సంబరాలు జరుపుకున్నారు. ఐఐటీ శిక్షణ రంగంలో అలెన్ హైదరాబాద్ సంస్థకు ఉన్న అగ్రస్థానాన్ని ఈ ఫలితాలు మరోసారి స్పష్టం చేశాయని సెంటర్ హెడ్ సౌరభ్ తివారీ, సౌత్ జోన్ హెడ్ మహేష్ యాదవ్ ఎంతో హర్షం వ్యక్తం చేశారు.
మెరిసిన గర్ల్స్ టాపర్ ఆరోహి దేశ్‌పాండే
హైదరాబాద్ కేంద్రంలో జరిగిన ఈ విజయోత్సవ సంబరాలలో జేఈఈ అడ్వాన్స్డ్ గర్ల్స్ టాపర్ ఆరోహి దేశ్‌పాండే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలెన్ ఇన్స్టిట్యూట్లో మూడేళ్ల పాటు క్రమశిక్షణతో క్లాస్రూమ్ కోచింగ్ తీసుకున్న ఆరోహి, ఈ పరీక్షలో 280 మార్కులు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆమె గర్ల్స్ కేటగిరీలో ఆల్ ఇండియా 1వ ర్యాంకు సాధించడంతో పాటు కామన్ ర్యాంక్ లిస్ట్ (CRL) లోనూ 77వ ర్యాంకును కైవసం చేసుకుని అందరి ప్రశంసలు అందుకుంది.
జాతీయ స్థాయిలో అలెన్ క్లీన్ స్వీప్ – సరికొత్త రికార్డు
ఇక జాతీయ స్థాయిలో కోటాకు చెందిన అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ వరుసగా మూడో ఏడాది కూడా ఆల్ ఇండియా మొదటి ర్యాంకును సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర లిఖించింది. అంతేకాకుండా అలెన్ ప్రస్థానంలో రెండోసారి దేశంలోనే మొదటి మూడు ర్యాంకులను (AIR 1, AIR 2, AIR 3) ఒకేసారి క్లీన్ స్వీప్ చేసి సరికొత్త రికార్డును నమోదు చేసింది. అలెన్ క్లాస్రూమ్ కోచింగ్ విద్యార్థి శుభమ్ కుమార్ 330 మార్కులతో ఆల్ ఇండియా 1వ ర్యాంకు సాధించగా, కబీర్ చిల్లర్ 2వ ర్యాంకు, జతిన్ చహర్ 3వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో అలెన్ విద్యార్థులు టాప్ 10 లోపల 6 ర్యాంకులు, టాప్ 50 లోపల 24 ర్యాంకులు సాధించి తమ ఆధిక్యాన్ని చాటగా, ఆన్లైన్ విభాగంలో యశ్వర్ధన్ 52వ ర్యాంకుతో టాపర్‌గా నిలిచాడని విద్యా సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.









