Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్క్రైంజిల్లా వార్తలుతెలంగాణ

Karimnagar : 1.1 కిలోల గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్ట్, మరొకరు పరారు..!

గంజాయి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న యువకుడిని కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు.

Karimnagar : 1.1 కిలోల గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్ట్, మరొకరు పరారు..!

కరీంనగర్‌ బ్యూరో, మనసాక్షి :

గంజాయి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న యువకుడిని కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 1 కిలో 100 గ్రాముల గంజాయి, రెడ్మీ మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి పోలీసులను చూసి బైక్‌పై పరారవడంతో అతడి కోసం గాలిస్తున్నారు. కరీంనగర్‌ రూరల్‌ మండలం నగునూరు నుంచి జూబ్లీ నగర్‌కు వెళ్లే మార్గంలో మాలగుట్టల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

కరీంనగర్ రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ. నిరంజన్‌ రెడ్డి, ఎస్‌ఐ జె. లక్ష్మారెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌ పక్కన ఉంచి ప్లాస్టిక్‌ కవర్‌లోని పదార్థాన్ని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేస్తుండటాన్ని గుర్తించారు. పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒకరు బైక్‌పై పరారయ్యాడు. మరో వ్యక్తి పారిపోయేందుకు యత్నించగా వెంబడించి పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్‌ గ్రామానికి చెందిన పైల్లా శ్రీమాన్‌ (18)గా గుర్తించారు.

అతడు డెకరేషన్‌ పనులు చేస్తూ, స్నేహితుల ద్వారా గంజాయి సేవనానికి అలవాటుపడినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. చంద్రాపూర్‌ నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి కరీంనగర్‌ పరిసర ప్రాంతాలకు తీసుకొచ్చి, చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారుచేసి ఒక్కో ప్యాకెట్‌ను రూ.100 చొప్పున యువకులకు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. సుమారు 15 రోజుల క్రితం మరో వ్యక్తితో కలిసి దాదాపు రెండు కిలోల గంజాయిని తీసుకొచ్చి, అందులో కొంత భాగాన్ని నగునూరు , జూబ్లీ నగర్‌, చర్లబూత్కూర్‌, కరీంనగర్‌ పరిసర ప్రాంతాల్లో విక్రయించినట్లు నిందితుడు తెలిపాడని పోలీసులు వెల్లడించారు.

మిగిలిన గంజాయిని విక్రయించేందుకు సిద్ధమవుతుండగా పట్టుకున్నట్లు వివరించారు. పంచుల సమక్షంలో గంజాయిని తూకం వేయగా 1 కిలో 100 గ్రాములుగా తేలిందని, దానితోపాటు మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తిని పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు చెప్పారు.

గంజాయికి యువత దూరంగా ఉండాలి..

యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు సూచించారు. మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యం, చదువు, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహాలు, బయటకు వెళ్లే సమయాలు, మొబైల్‌ వినియోగంపై శ్రద్ధ వహించాలని కోరారు.

రూరల్‌ మండలంలోని ఏ గ్రామంలోనైనా గంజాయి విక్రయాలు, వినియోగానికి పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, చదువుపై దృష్టి సారించి తల్లిదండ్రులకు, గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని ఇన్‌స్పెక్టర్‌ ఎ. నిరంజన్‌ రెడ్డి కోరారు.

మరిన్ని వార్తలు