Montha : మొంథా తుఫాన్ ప్రళయం.. రైతుల కంటతడి..!

Montha : మొంథా తుఫాన్ ప్రళయం.. రైతుల కంటతడి..!
వర్షానికి నేలపాలైన వరి పంటలు
పెట్టుబడి కూడా రాని పరిస్థితులు
నల్లగొండ/ మిర్యాలగూడ, మన సాక్షి:
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా దంచి కొడుతున్న మొంథా తుఫాన్ రైతులను వణికిస్తోంది. మంగళవారం రాత్రి నుంచి వానజడి పట్టింది. ఫలితంగా నల్గొండ జిల్లాతో పాటు మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా పలు ఏర్లు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. సెలయేర్లు పారుతున్నాయి. పెద్ద కుంటలు, చెరువులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. పలుచోట్ల రోడ్లపైకి నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడ్డాయి. జనజీవనం స్తంభించింది. వేలాది ఎకరాల్లో పంట నీటిపాలైంది. ప్రధానంగా వరి ,పత్తి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు.
పంట చేతికొచ్చే సమయాన్ని నెలకొన్న వాతావరణం రైతులకు ఆందోళన కలిగించింది. ప్రస్తుతం తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో చేతికొచ్చిన పత్తి తడవడంతో అటు వ్యాపారులు ఇటు ఐకెపి,సిపిఐ కేంద్రాల్లో మద్దతు ధర దక్కడం లేదు. ఇప్పుడిప్పుడే ఊపు అందుకుంటున్న వరి కోతల పైన తుఫాను ప్రభావం పడింది వరి కోతలు ఆపితే పంట పాడవుతుంది. కోస్తే ఎక్కడ ఆరబోయాలో అన్న సంశయంతో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
తుఫాను ఇంకా పొంచి ఉంది ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజల మనసంతా ఇంకా మొంథా మబ్బులే కమ్మాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వర్షాలతో నేలపాలవుతుందని రైతులు విచారణ వ్యక్తం చేస్తున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో దామరచర్ల , అడవిదేవులపల్లి , వేములపల్లి, మాడుగులపల్లి, మిర్యాలగూడ మండలాలలో రైతులు లక్షల ఎకరాల్లో పంటను సాగు చేశారు.
ఈ తుఫాన్ విరుచుక పడుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వరి కోతల సమయంలో వర్షాలు కురుస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాలు అధికంగా కురుస్తుండడంతో ప్రభుత్వమే వరి కోతలను వాయిదా వేసుకోవాలని చెప్పడంతో రైతులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మొంథా తుఫాను ప్రభావంతో వరి పంటలు నేలకొరిగి మొలకెత్తి ప్రమాదం ఉందని. ఇప్పటికే ఇటీవల కురిసిన వర్షాలతో కొంతమేర పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తుఫాన్ ప్రభావం ఇంకా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక వరి పంటను భద్రపరిచేందుకు పట్టాలు అందుబాటులో లేవని రైతులు వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని రైతులు, రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మొలకెత్తిన ధాన్యపు బస్తాలు
తిప్పర్తి :
అకాల వర్షాల వలన మొలకెత్తిన ధాన్యపు బస్తాలు దర్శనం ఇస్తున్నాయి తిప్పర్తి మార్కెట్ యార్డులో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలు మొలకెత్తి దర్శనమిస్తున్నాయి వివరాల్లోకి వెళితే ఇండ్లూరు గ్రామానికి చెందిన పిల్లి శ్రీను వరి పంటను ఆరు ఎకరాలలో సాగు చేసినప్పటికీ భారీ వర్షాలకు వరి నేలకు వరగడం వల్ల చాలావరకు పంట నష్టం వాటిల్లింది.
ఎలాగోలాగా పంట కోసి మార్కెట్ కు తీసుకువస్తే 25 రోజులు ఐనా మైచర్ రాక చాలా ఇబ్బంది పడ్డామని తీరా కాంటా అయ్యి బస్తాల్లోకి ఎత్తి లోడ్ చేయకముందే మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బస్తాలు తడిసి మొలకెత్తాయని వాటిని అధికారులు చూసి మళ్లీ ఆరబెట్టాలని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కన్నీళ్లు మిగిల్చిన తుఫాను
వేములపల్లి :
వేములపల్లి మండల కేంద్రంలో మూడు రోజుల నుంచి విడవకుండా కురుస్తున్న వర్షాలకు మొంథా తుఫాను తోడైంది. రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. పొలాలు చెరువుల తయారయ్యాయి. కోత కొచ్చిన వరితోపాటు పొట్ట దశలో, గింజ గట్టిపడే దశలో ఉన్న వరి నేల వాలింది, రైతులకు కన్నీళ్లే మిగిల్చింది. గ్రామంలో మొత్తం 1000 ఎకరాలు పంట నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు.
ఎక్కువ విస్తీర్ణంలో గింజ పాలు పోసుకునే దశలో ఉంది గాలులకు వెన్ను విరిగి నేల వారడంతో పంట కోలుకునే పరిస్థితి లేదని రైతులు కన్నీటి పర్వతం అవుతున్నారు. పంటలో నారు పోసుకున్న కానుంచి వరి గింజ దశ వరకు ఎకరానికి 30,000 రైతుకు పెట్టుబడి అవుతుంది.మొంథా తుఫాను అకాల వర్షంతో పూర్తిగా పంటలు నష్టపోయిన వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మా రైతుకు పెట్టుబడి సహాయం అందించాలని రైతులు విన్నవించుకున్నారు.
అకాల వర్షంతో తీరని నష్టం
మాడుగులపల్లి :
రెండు మూడు రోజులుగా కురుస్తున్నటువంట మొంథా తుఫాను కారణంగా రైతుల జీవితాల్లో తీరని లోటును మిగిల్చింది మాడుగులపల్లి, తిప్పర్తి మండలం లలో రెండు రోజులుగా నిరంతరంగా కురుస్తున్నటువంటి వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఆరబెట్టి కుప్ప నూర్చిన ధాన్యం అకాల వర్షం వలన ధాన్యం రాసి కింద నీరు చేరి తడిసి ముద్దయినయి అని రైతులు తన గోడును వెళ్లబుచ్చుతున్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట తీరా మార్కెట్కు వచ్చేసరికి అకాల వర్షాల వలన ప్రభుత్వం ప్రకటించిన 17% మాయిచ్చర్ రాక ధాన్యాన్ని ఇటు అటు తిరగబోస్తూ రైతుల అవస్థలు పడుతున్నారు ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని వ్యవసాయ అధికారులను వేడుకుంటున్నారు.

















