ఎస్సై అనిల్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి – యాదవ సంఘం డిమాండ్

ఎస్సై అనిల్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి – యాదవ సంఘం డిమాండ్

జగిత్యాల రూరల్ ఎస్సైగా పనిచేస్తున్న అనిల్ ను సస్పెండ్ చేయడం బాధాకరమైన విషయమని, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మిర్యాలగూడ పట్టణ యాదవ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కట్టెబోయిన శ్రీనివాస్ యాదవ్ ,పిన్నిబోయిన శ్రీనివాస్ యాదవ్ లు డిమాండ్ చేశారు. ఆదివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని స్థానిక యాదవ సంఘ భవనంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

 

ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ముకాస్తూ జరిగిన విషయంపై ఎటువంటి విచారణ లేకుండానే సస్పెండ్ చేయడం అన్యాయమని, ప్రభుత్వం అట్టి సస్పెన్షన్ ఎత్తివేయకపోతే యాదవ సంఘం అంతా ఒకటై ప్రభుత్వం యొక్క అంతు చూస్తామని అన్నారు.

ఆయనపై సస్పెన్షన్ ఎత్తేసే వరకు పోరాటం చేస్తామని, ప్రభుత్వానికి యాదవులు ఎప్పుడు సహకారం అందిస్తారని కానీ జరిగిన విషయంపై ఇప్పటివరకు ప్రభుత్వం ఏ విధమైనా ప్రకటన చేయకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అనిల్ సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేని పక్షంలో ప్రభుత్వంపై ఏ పోరాటానికైనా యాదవులు సిద్ధంగా ఉంటారని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంఘం ప్రచార కార్యదర్శి దారం మల్లేష్ యాదవ్, యాదవ సంఘం జిల్లా నాయకులు గుడిపాటి వెంకటేశ్వర్లు , జవ్వాజి సత్యనారాయణ యాదవ్ , యాదవ సంఘం డివిజన్ అధ్యక్షులు చిమట యర్రయ్య యాదవ్, యువజన సంఘం ప్రధాన కార్యదర్శి గంగుల బిక్షం, గౌరవాధ్యక్షులు బచ్చనబోయిన మహేష్ తదితరులు పాల్గొన్నారు.